ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా దుబాయ్‌లో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ‘కింగ్’ విరాట్ కోహ్లీ సెంచరీతో మెరిశాడు. 111 బంతుల్లో 7 ఫోర్లతో 100 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. వన్డేల్లో ఇది కోహ్లీకి 51వ సెంచరీ. చాలా కాలం తర్వాత వన్డేల్లో కింగ్ సెంచరీ చేయడంతో అతడి ఫాన్స్ సంతోషంలో మునిగిపోయారు. అయితే పాకిస్థాన్‌పై విరాట్ సెంచరీ చేస్తాడో లేదో అని ఫాన్స్ కాస్త టెన్షన్ పడ్డారు. అందుకు కారణం జట్టు చేయాల్సిన రన్స్ తక్కువగా ఉండడమే.
పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ సెంచరీ కోసం తాను లెక్కలు వేసుకున్నట్లు ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ తెలిపాడు. విరాట్ 86పై ఉండగా.. జట్టు విజయానికి 19 పరుగులు అవసరం అయ్యాయి. అప్పుడు అక్షర్ పటేల్ క్రీజులో అడుగుపెట్టాడు. 41వ ఓవర్ ముగిసేసరికి భారత్ విజయానికి 17, కోహ్లీ సెంచరీకి 13 రన్స్ కావాలి. అయితే 42వ ఓవర్లో షాహీన్ అఫ్రిది వైడ్స్ వేయడంతో విరాట్ సెంచరీ చేయడమో అని అందరూ అనుకున్నారు. ఈ సమయంలో కోహ్లీ సెంచరీ కోసం అక్షర్ లెక్కలు వేశాడు. భారీ షాట్స్ ఆడకుండా.. సింగిల్స్ తీసి అతడికి స్ట్రైకింగ్ ఇచ్చాడు. ఫోర్ బాదిన విరాట్ సెంచరీ మార్క్ అందుకున్నాడు.
విరాట్ కోహ్లీ సెంచరీపై అక్షర్ పటేల్ మాట్లాడుతూ… ‘చివర్లో విరాట్ సెంచరీ కోసం నేను కూడా లెక్కలు వేశా. బంతి బ్యాటు అంచును తాకి బౌండరీ వెళ్లొద్దని కోరుకున్నా. అప్పుడు చాలా సరదాగా అనిపించింది. నా కెరీర్‌లో ఇంత ఒత్తిడి ఉన్న మ్యాచ్‌ను క్రీజులో ఉండి చూడటం ఇదే మొదటిసారి. విరాట్ అద్భుతమైన సెంచరీ బాదాడు. 50 ఓవర్ల పాటు ఫీల్డింగ్ చేసిన అనంతరం వికెట్ల మధ్య పరుగెత్తడం అంత సులువు కాదు. ఇది కోహ్లీ ఫిట్‌నెస్ స్థాయికి నిదర్శనం’ అని చెప్పాడు.