NTV Telugu Site icon

Donald Trump: బాధ్యతలు స్వీకరించముందే విడిచిపెట్టండి.. లేదంటే నరకం చూపిస్తా: ట్రంప్‌

Donald Trump

Donald Trump

హమాస్‌ ఉగ్రవాద సంస్థకు అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికలు జారీ చేశారు. తాను అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించ ముందే.. హమాస్‌ తన వద్ద బందీలుగా ఉంచుకున్న ఇజ్రాయెల్‌ పౌరులను విడుదల చేయాలని, లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. దురాగతాలకు పాల్పడే వారికి నరకం చూపిస్తానని ట్రంప్‌ వార్నింగ్ ఇచ్చారు. ఈ మేరకు ట్రంప్‌ తన సోషల్‌మీడియా ఫ్లాట్‌ఫామ్ ట్రూత్‌లో ఓ పోస్ట్‌ చేశారు.

‘అమెరికా అధ్యక్షుడిగా 20 జనవరి 2025న బాధ్యతలు స్వీకరిస్తా. ఈలోగా బందీలను విడుదల చేయాలి. లేని పక్షంలో ఈ దురాగతాలకు పాల్పడే వారికి నరకం చూపిస్తా. చరిత్రలో చూడని పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. వెంటనే బందీలను రిలీజ్ చేయండి’ అని పాలస్తీనాకు చెందిన హమాస్‌ ఉగ్రవాద సంస్థను హెచ్చరించారు. ఇజ్రాయెల్‌పై ఒత్తిడి పెంచేందుకు హమాస్ ఉగ్రవాద సంస్థ అల్‌ తాజాగా ఓ వీడియోను రిలీజ్ చేసింది. వీడియోలో అమెరికా-ఇజ్రాయెల్‌ జాతీయుడైన 20 ఏళ్ల ఎడాన్‌ అలెగ్జాండర్‌ మాట్లాడుతూ.. తాను 420 రోజులుగా హమాస్‌ చెరలో బందీగా ఉన్నానని చెప్పాడు. తామంతా భయంతో రోజుకు వెయ్యిసార్లు చస్తున్నామని, తమను త్వరగా విడిపించండని కోరాడు. ఈ వీడియోపై ఎడాన్‌ తల్లి స్పందిస్తూ.. ప్రధాని నెతన్యాహు తన వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలని కోరారు. ఈ వీడియో పైనే డొనాల్డ్‌ ట్రంప్‌ రియాక్ట్ అయ్యారు.

Also Read: Virat Kohli Century: ఒక్క సెంచరీ.. సచిన్, బ్రాడ్‌మన్ రికార్డులు బద్దలు!

2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై హమాస్‌ దాడి చేసింది. ఆ దాడిలో సుమారు 1,200 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. 251 మందిని హమాస్‌ ఉగ్రవాద సంస్థ బంధించి.. గాజాకు తీసుకెళ్లింది. తాత్కాలికంగా జరిగిన కాల్పుల విరమణ ఒప్పందం సమయంలో కొందరు బందీలు విడుదలయ్యారు. అనంతరం జరిగిన పలు ఘటనల్లో కొందరు మృతి చెందారు. ప్రస్తుతం సుమారు 50 మంది మాత్రమే సజీవంగా ఉన్నట్లు ఇజ్రాయెల్‌ మీడియా పేర్కొంది.

Show comments