NTV Telugu Site icon

Minister Harish Rao: కేటీఆర్‌ను ముఖ్యమంత్రిగా చేసినా అంగీకరిస్తా..

Harish Rao

Harish Rao

Minister Harish Rao: కాళేశ్వరం మీదు ఏ మాత్రం అవగాహన లేకుండా కాంగ్రెస్‌ వాళ్లు మాట్లాడుతున్నారని మంత్రి హరీశ్‌ రావు అన్నారు. కేసీఆర్‌, హరీశ్‌ రావు మీద బురద చల్లడానికే ఈ ఆరోపణలు చేస్తున్నారన్నారు. కోదాడతో పాటు పలు నియోజకవర్గాలకు సాగునీరు వచ్చింది నిజం కాదా అంటూ ప్రశ్నించారు. వచ్చిన మంచి పేరును చెడగొట్టాలనే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు.
మంత్రి హరీశ్ మాట్లాడుతూ.. “కాళేశ్వరంపై కాంగ్రెస్ గోబెల్స్ ప్రచారం చేస్తోంది.. కాళేశ్వరం వచ్చాక రెండు పంటలు పండింది నిజం కాదా?.. మంచి పేరు వచ్చిందనే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు.. లక్ష కోట్ల అవినీతి జరిగిందని రాహుల్‌గాంధీ అవగాహన లేకుండా మాట్లాడారు.. మంచిపేరు పోగొట్టాలనే మాపై ఆరోపణలు చేస్తున్నారు.. విపక్షాల ఆరోపణల్లో నిజం లేదు.. మరి కాంగ్రెస్ కట్టిన ప్రాజెక్టుల్లో వారు కమీషన్లు తీసుకున్నారా.” అని మంత్రి హరీశ్ ప్రశ్నించారు. కాళేశ్వరంకు వెళ్లి రాహుల్ గాంధీ జోకర్‌ అయిపోయారన్నారు.

Also Read: Harish Rao: కేసీఆర్‌ హ్యాట్రిక్‌ కొట్టడం ఖాయం

చాలా పెండింగ్‌ ప్రాజెక్టులను బీఆర్‌ఎస్ వచ్చాకే రన్నింగ్‌ ప్రాజెక్టులుగా మార్చామన్నారు. అందుకే రాష్ట్రంలో చాలా వరకు భూములు పచ్చగా మారాయన్నారు. కాంగ్రెస్‌, తెలుగుదేశం ప్రభుత్వాల వల్లే చాలా ప్రాజెక్టులు పెండింగ్‌ ప్రాజెక్టులుగా మారాయని విమర్శించారు. చంద్రబాబు అరెస్ట్ విషయంలో తాము ఖండించామని మంత్రి హరీశ్ స్పష్టం చేశారు. అలాంటి కక్ష సాధింపు చర్యలు తెలంగాణ రాష్ట్రంలో జరగవన్నారు.

ఏపీకి సంబంధించి 26 కులాలను బీసీల నుంచి తొలగించారని ఈ విషయాన్ని మేనిఫెస్టోలో పెడతారా? అనే ప్రశ్నపై మంత్రి హరీశ్ స్పందించారు. ఈ విషయంపై సీఎం కేసీఆర్‌ పరిశీలిస్తున్నారని మంత్రి సమాధానం ఇచ్చారు. తనకు ముఖ్యమంత్రి కావాలని, అధికారం కావాలని ఏనాడు ఆలోచించలేదని మంత్రి హరీశ్‌ స్పష్టం చేశారు. తనకు పదవుల కంటే వ్యక్తిత్వమే చాలా గొప్పదని.. పదవుల కోసం ఏనాడు పాకులాడనని చెప్పారు. కేసీఆర్‌ ఏది చెప్పినా పాటిస్తామని స్పష్టం చేశారు. మంత్రి కేటీఆర్ తనకు చాలా మంచి స్నేహితుడని తెలిపారు. కేటీఆర్‌ను ముఖ్యమంత్రిగా చేసిన అంగీకరిస్తామన్నారు. కాంగ్రెస్‌లోలాగా బీఆర్‌ఎస్‌లో పదవుల కోసం కుమ్ములాటలు ఉండవన్నారు.