NTV Telugu Site icon

AUS vs IND: గబ్బాలో పోరాటం.. ఆకాశ్ దీప్‌ ఆసక్తికర విషయాలు!

Untitled Design

Untitled Design

గబ్బా టెస్టులో చివరి రోజు వేగంగా ఆడి భారత జట్టును ఇరుకున పెడదామనుకున్న ఆస్ట్రేలియాకు నిరాశే మిగిలింది. వరణుడి రాకతో ఐదవ రోజులో రెండు సెషన్ల ఆట సాగలేదు. వర్షం రావడంతో పాటు టెయిలెండర్లు ఆకాశ్ దీప్, జస్ప్రీత్ బుమ్రాల పోరాటంతో భారత్ ఫాలో ఆన్‌ గండం నుంచి బయటపడి.. డ్రా చేసుకోగలిగింది. మొదటి ఇన్నింగ్స్‌లో ఆకాశ్‌ దీప్ (31 పరుగులు) దూకుడుగా ఆడి.. బుమ్రాతో కలిసి చివరి వికెట్‌కు 47 పరుగులు జోడించాడు. గబ్బా పోరాటం గురించి ఆకాశ్‌ ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.

మెల్‌బోర్న్ వేదికగా గురువారం (డిసెంబర్ 26) నుంచి భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య నాలుగో టెస్టు ప్రారంభం కానుంది. బాక్సింగ్ డే టెస్ట్‌కు ముందు ఆదివారం మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో విలేకరులతో ఆకాశ్ దీప్‌ మాట్లాడుతూ… ‘మేం లోయర్‌ ఆర్డర్‌లో బ్యాటింగ్‌కు వచ్చాం. కాబట్టి 20-30 పరుగుల సహకారం జట్టుకు చాలా విలువైనది. నా మైండ్‌సెట్‌ కూడా అదే. ఫాలో ఆన్‌ గురించి నేను అస్సలు ఆలోచించలేదు. నాటౌట్‌గా మాత్రమే ఉండాలనుకున్నా. దేవుడి దయతో ఫాలో ఆన్‌ గండం నుంచి మేం బయటపడ్డాం’ అని తెలిపాడు.

Also Read: Telangana DGP: ప్రజల భద్రత కంటే.. సినిమా ప్రమోషన్‌ ముఖ్యం కాదు!

‘ఫాలో ఆన్‌ పరిస్థితుల నుంచి బయటపడడంతో జట్టులో జోష్ వచ్చింది. మా డ్రెస్సింగ్‌ రూమ్‌ చాలా సంతోషించింది. జట్టులోని ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేశారు. ఆస్ట్రేలియాలో ఆడటం నాకు ఇదే తొలిసారి. జస్ప్రీత్ బుమ్రా నాకు ధైర్యం చెప్పాడు. మరీ ఎక్కువగా ఆలోచించొద్దని, ఆటపైనే దృష్టి పెట్టమన్నాడు. భారత్‌లో ఆడిన మాదిరిగానే ఇక్కడా ఆడమని బుమ్రా నాతో చెప్పాడు’ అని ఆకాశ్ దీప్‌ చెప్పుకొచ్చాడు. పాట్ కమ్మిన్స్‌ బౌలింగ్‌లో ఆకాష్ ఫోర్ కొట్టగానే టీమిండియా ఫాలో ఆన్‌ నుంచి బయటపడింది. వెంటనే డ్రెస్సింగ్ రూమ్‌లో సంబరాలు ప్రారంభమయ్యాయి. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, గౌతమ్ గంభీర్ ఒకరికొకరు హై-ఫైవ్‌లు కొట్టుకున్నారు.

Show comments