పైరసీ వెబ్‌సైట్ ‘ఐబొమ్మ’ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులు ‘ఐబొమ్మ’ ప్రధాన నిర్వాహకుడు ఇమ్మడి రవిని అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు రవిని నాంపల్లి కోర్టుకు తరలించారు. జడ్జి ఎదుట ప్రవేశపెట్టారు పోలీసులు. విచారించిన జడ్జి ఐ-బొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవికి 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో పోలీసులు రవి ని చంచల్ గూడ జైలు కు తరలించారు. 2019 నుంచి ‘ఐబొమ్మ’ వెబ్‌సైట్‌లో పైరసీ సినిమాలను అప్లోడ్ చేస్తూ భారీ నెట్‌వర్క్‌ను నడిపినందుకు రవి ప్రధాన నిందితుడిగా గుర్తించారు. థియేటర్‌లలో కొత్తగా విడుదలైన సినిమాలను గంటల వ్యవధిలోనే వెబ్‌సైట్‌లో అప్లోడ్ చేసే పెద్ద సర్కిల్‌ను అతడు నడిపేవాడని పోలీసులు వెల్లడించారు.
Also Read:Madhya Pradesh: రాజారామ్ మోహన్ రాయ్ ‘‘బ్రిటిష్ ఏజెంట్’’.. విద్యా మంత్రి షాకింగ్ కామెంట్స్..
ఆరు సంవత్సరాల కాలంలో వేలాది సినిమాలను పైరసీ చేసి అప్లోడ్ చేయడంతో టాలీవుడ్‌కు దాదాపు 3వేల కోట్లు నష్టం జరిగినట్లు అంచనా వేశారు. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఫిర్యాదు మేరకు సీసీఎస్ పోలీసులు ఐబొమ్మతో పాటు 65 పైరసీ వెబ్‌సైట్‌లపై కేసులు నమోదు చేశారు. ఇప్పటివరకు ఈ కేసులో ఐదుగురు కీలక నిందితులను అరెస్టు చేశారు. తాజాగా రవిని అదుపులోకి తీసుకోవడం కేసులో కీలక మలుపుగా భావిస్తున్నారు.