తాను పేదలకు అన్యాయం చేసే వ్యక్తిని కాదని, అవినీతి సొమ్ము తినే వ్యక్తిని అస్సలు కాదని మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి అన్నారు. తన రాజకీయ జీవితం జీవితం మొత్తంలో పేదల కోసమె పోరాటం చేశాన్నారు. కొందరు రాజకీయ ప్రత్యర్థులు కావాలనే తనపై విమర్శలు చేస్తున్నారన్నారు. కార్మికుల పక్షాన పోరాటం చేసి వారికి న్యాయం జరిగేలా చేస్తానని కొండా మురళి చెప్ప్పుకొచ్చారు. అజంజాహీ మిల్స్ యూనియన్ కార్యాలయ స్థలం కబ్జా ఆరోపణలపై కొండా మురళి స్పందిస్తూ పై వ్యాఖ్యలు చేశారు.
మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి మాట్లాడుతూ… ‘ఆజంజాహీ మిల్లు భూములు కార్మికుల కుటుంబాలకు చెందాల్సిందే. నా రాజకీయ జీవితం మొత్తం పేదల పక్షాన పోరాటం చేస్తున్నాను. నేను బీఆర్ఎస్‌లో ఉన్నప్పుడు అజంజాహీ మిల్లును కుడాకు ఇవ్వొద్దని కేటీఆర్‌కు చెప్పాను. అప్పటి ఎమ్మెల్యే, కుడా చైర్మన్ నన్ను విభేదించారు. అజంజాహీ మిల్స్ స్థలం కోసం పోరాటం చేశాను. నేను హైదరాబాద్‌లో ఉన్నపుడు నమశ్శివాయ నాకు ఫోన్ చేశాడు. వేల మందికి ఉపాధి ఇచ్చే షాపింగ్ మాల్ ప్రారంభానికి రావాలని చెప్పారు. చట్టపరంగా 1200 గజాల కొనుక్కున్నానని చెప్పాడు. కేటీఆర్, సంతోష్, కవితకు అప్పులిచ్చిన వ్యక్తి నమశ్శివాయ. అలాంటి వ్యక్తి నా దగ్గరకు వస్తే కాదనలేకపోయాను. అందుకే ఆ స్థలంలో షాపింగ్ మాల్ భూమి పూజకు హాజరయ్యాను’ అని తెలిపారు.
‘నేను పేదలకు అన్యాయం చేసే వ్యక్తిని కాదు. నమశ్శివాయ స్థలం కుడాకు చెందినది కాదు, ఏ సంస్థకు చెందినది కూడా కాదు. అయినప్పటికీ ఆ స్థలంలో ఎలాంటి పని చేయొద్దని చెప్పాను. కార్మికుల పక్షాన పోరాటం చేసి వారికి న్యాయం జరిగేలా చేస్తాను. నేను అవినీతి సొమ్ము తినే వ్యక్తిని కాదు. అజంజాహి కార్మిక భవనం స్థలంపై కార్మికుల పక్షాన కొట్లాడిందే నేను. ఓం నమశ్శివాయ అనే వస్త్ర వ్యాపారి నా సహాయం కోరాడు. శత్రువుకు భయం పుట్టించేందుకే ఆ వ్యాపారితో మాట్లాడిన మాట వాస్తవమే. కానీ నేనెప్పుడూ కార్మికుల పక్షమే. ఆ భూమిపై పూర్తి స్థాయిలో సర్వేచేయించి, కార్మికులకు ఫంక్షన్ హాల్ నిర్మిస్తాము. కొందరు రాజకీయ ప్రత్యర్థులు కావాలనే విమర్శలు చేస్తున్నారు. రికార్డుల్లో కార్మికుల పేర్లు లేవు. ఆ స్థలం 2015లోనే వస్త్ర వ్యాపారికి ముటేషన్ అయింది. అయినా వారికి సగం స్థలం ఇప్పిస్తాము. అజంజాహి మిల్ 11 గుంటలపై వివాదం చేస్తున్నారు. వరంగల్ సెంట్రల్ జైలును ఎందుకు తరలించారు?. ఆ జైలులో ఉన్న విలువైన బండలు ఏమయ్యాయ్?’ అని కొండా మురళి ప్రశ్నించారు.