HYDRAA: నగరంలో మరో చెరువు పునరుద్ధరణకు హైడ్రా ప్లాన్.. 3 ఎకరాల నుంచి 12 ఎకరాలకు విస్తరణ

Hydraa

Hydraa

HYDRAA: హైదరాబాద్‌లోని కృష్ణకాంత్ పార్కు చెరువు పునరుద్ధరణపై హైడ్రా (HYDRAA) ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ పార్కులో దాదాపు గంటపాటు మార్నింగ్ వాకింగ్ చేస్తూ వాకర్స్, సందర్శకులతో ముఖాముఖి మాట్లాడి అక్కడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రకృతి పరిరక్షణతో పాటు చెరువు, పార్కు సమగ్ర అభివృద్ధిపై వారి నుంచి పలు సూచనలు స్వీకరించారు.

ప్రస్తుతం 3 ఎకరాలకు మాత్రమే పరిమితమైన కృష్ణకాంత్ పార్కు చెరువును 12 ఎకరాలకు విస్తరిస్తూ పునరుద్ధరించేందుకు హైడ్రా ప్రణాళికలు సిద్ధం చేసింది. చెరువు లోతును పెంచి భారీగా వరదనీరు నిల్వ ఉండేలా చర్యలు తీసుకోవడంతో పాటు, వరదనీరు నేరుగా చెరువులోకి చేరేలా ఇన్‌లెట్లను అభివృద్ధి చేయనున్నారు. జూబ్లీహిల్స్, వెంకటగిరి ప్రాంతాల నుంచి వచ్చే వరదనీటిని కృష్ణకాంత్ పార్కు చెరువుకు మళ్లించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. దీనివల్ల కృష్ణానగర్, యూసుఫ్‌గూడ, మధురానగర్, శ్రీనివాస్ నగర్, అమీర్‌పేట, మైత్రివనం తదితర లోతట్టు ప్రాంతాలకు వరద ముప్పును గణనీయంగా తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు.

ఈ పర్యటనలో వాకర్స్ పలు సమస్యలను కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. పార్కు దక్షిణం వైపు ఉన్న చెత్త డంపింగ్ యార్డు కారణంగా తీవ్ర దుర్వాసన వస్తోందని, అలాగే సరైన ప్రహరీ గోడ లేకపోవడంతో చెత్తాచెదారం పార్కులోకి వస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. పార్కులోని పాడైన జిమ్ పరికరాలను వెంటనే మరమ్మతు చేయాలని కోరారు. తమ్మిడికుంట తరహాలో కృష్ణకాంత్ పార్కులోనూ ఆధునిక ఓపెన్ జిమ్ ఏర్పాటు చేయాలని, చెరువుతో పాటు పార్కును కూడా సమగ్రంగా అభివృద్ధి చేయాలని వాకర్స్ విజ్ఞప్తి చేశారు. నగరంలో హైడ్రా ఇప్పటికే పునరుద్ధరించిన చెరువుల అభివృద్ధి తీరును ఈ సందర్భంగా వాకర్స్ ప్రశంసించారు.