NTV Telugu Site icon

AV Ranganath: బెంగ‌ళూరులో చెరువుల పున‌రుద్ధర‌ణ తీరును ప‌రిశీలించిన హైడ్రా క‌మిష‌న‌ర్..

Ranganath

Ranganath

లేక్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పేరుగాంచిన ఆనంద్ మ‌ల్లిగ‌వాడ్‌తో హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ వీడియో స‌మావేశం నిర్వహించారు. నేరుగా హైడ్రా కార్యాల‌యం నుంచి బెంగ‌ళూరులో చెరువుల పున‌రుద్ధర‌ణ జ‌రిగిన తీరును క‌మిష‌న‌ర్‌ ప‌రిశీలించారు. మురుగుతో నీళ్లు లేకుండా ఉన్న వాటిని ఎలా మంచినీటి చెరువులుగా తీర్చి దిద్దారో ప‌వ‌ర్ పాయింట్ ప్రజెంటేష‌న్ ద్వారా ఆనంద్‌ వివరించారు. బెంగ‌ళూరులో మొత్తం 35 చెరువుల‌ను పున‌రుద్ధరించిన విధానాన్ని తెలిపారు. త‌క్కువ ఖ‌ర్చుతో చెరువుల‌కు పున‌రుజ్జీవ‌నం క‌ల్పించిన తీరును హైడ్రా ప‌రిశీలించింది. పేరుకుపోయిన వ్యర్థాల‌ను తొల‌గించి స్వచ్ఛమైన నీరు చెరువుకు చేరేలా ఏర్పాట్లు చేయనున్నారు. మురుగు నీటి కాలువ‌ల నుంచే శుద్ధి చేసే ప్రక్రియ‌ను ప్రారంభించి.. చెరువులోకి చేరే ముందు మూడు నాలుగు ద‌శ‌ల్లో నీరు ఉంచి ఫిల్టర్ చేసిన తీరుపై హైడ్రా దృష్టి పెట్టనుంది.

Read Also: Congress: హర్యానా కాంగ్రెస్‌లో లుకలుకలు.. ఓటమి సమీక్షకి సెల్జా, సూర్జేవాలకు అందని ఆహ్వానం..

మురుగు నీటి కాలువ‌లకు రెండు వైపులా మొక్కలు నాట‌డం, చెరువుకు చేరేలోపే కొంత‌మేర శుద్ధి జ‌రిగేలా బెంగ‌ళూరులో ఏర్పాటు చేసిన విధానంపై అధ్యయ‌నం చేశారు. ఈ క్రమంలో.. బెంగ‌ళూరు వెళ్లి అక్కడ చెరువుల‌ను పున‌రుద్ధరించిన తీరును క్షేత్రస్థాయిలో ప‌రిశీలించాల‌ని హైడ్రా ఆలోచ‌నలో ఉంది. ఆనంద్ మ‌ల్లిగ‌వాడ్‌ను హైద‌రాబాద్‌కు పిలిపించి.. ఇక్కడ చెరువుల పున‌రుద్ధర‌ణ‌పై స‌హాయ‌ స‌హ‌కారాల‌ను అంద‌జేయ‌మ‌ని హైడ్రా కోర‌నుంది. కూల్చివేత‌ల వ్యర్ధాల‌ను తొల‌గించి ముందుగా సున్నం చెరువు, అప్పా చెరువు, ప్రగ‌తిన‌గ‌ర్ వ‌ద్ద ఉన్న ఎర్రకుంట‌, కూక‌ట్‌ప‌ల్లి చెరువుల‌కు పున‌రుజ్జీవ‌నం క‌ల్పించనుంది హైడ్రా.. చెరువులో శుద్ధ జ‌లాలుంటే ప‌రిస‌రాలు చ‌ల్లగా.. ఏపుగా పెరిగిన మొక్కల‌తో చ‌క్కటి ప‌ర్యావ‌ర‌ణం స్థానికుల‌కు అందుతుంది. అందుకే స్థానికుల‌ను పెద్ద సంఖ్యలో భాగ‌స్వామ్యం క‌ల్పించి.. వారికే నిర్వహ‌ణ బాధ్యత‌లు స్వచ్ఛందంగా తీసుకునేలా హైడ్రా క‌స‌ర‌త్తు చేస్తోంది.

Read Also: Crime: తల్లిదండ్రులను వేధించిన కొడుకు.. వాటర్ ట్యాంకులో దూకి వృద్ధ దంపతుల ఆత్మహత్య