డ్రగ్ ఫ్రీ హైదరాబాద్ కావాలంటే ఉక్కుపాదం మోపాల్సిందే. డ్రగ్స్ సప్లై చేస్తున్న వారి పీఛమణచాల్సిందే. ఇప్పుడిదే చేస్తోంది ఈగల్ టీమ్. కానీ పబ్స్ మాటున జరిగే గలీజ్ దందాకు చెక్ పెట్టనంత కాలం.. ఇది సాధ్యం కాదనేది నిపుణుల మాట. ఎందుకంటే డ్రగ్స్ చేసే అరాచకం అంతా ఇంతా కాదు. డ్రగ్స్ మత్తు మనిషి జీవితాన్ని నాశనం చేస్తుంది. ఉన్మాదిలా మారుస్తుంది. ఫలితంగా సమాజంలో అలజడి రేగుతుంది. ఇది ఎంత మాత్రం మంచిది కాదు.. ఇటీవలి కాలంలో చూస్తే హైదరాబాద్‌లో డ్రగ్ కల్చర్ విపరీతంగా పెరిగింది. విద్యా సంస్థలు, కాలేజీలు, ఐటీ ప్రొఫెషనల్స్ ఉండే ప్రాంతాలు, ఫిల్మ్ ఇండస్ట్రీ.. ఇలా ఏ ప్రాంతం తీసుకున్నా అక్కడ డ్రగ్స్ లింకులు బయట పడుతున్నాయి. పోలీసుల దాడులకు భయపడకుండా చాలా మంది పెడ్లర్లు, స్మగ్లర్లు డ్రగ్ దందాకు తెరతీస్తున్నారు. పబ్ యాజమాన్యాలు సైతం కన్జూమర్స్‌ను ఆకట్టుకునేందుకు డ్రగ్స్ సరఫరా మొదలు పెట్టాయి..
అటు సిటీ శివార్లలో ఉన్న ఫామ్ హౌజ్‌ల్లో రేవ్ పార్టీలు, ముజ్రా పార్టీలు నిర్వహించే వారు వాటిల్లో తప్పకుండా డ్రగ్స్ వినియోగిస్తున్నారు. ఇటు గేటెడ్ కమ్యూనిటీలు, అపార్టుమెంట్లలో కూడా డ్రగ్స్ వినియోగం పెరుగుతోంది. అంటే హైదరాబాద్‌లో మాదక ద్రవ్యాలు ఏ రేంజ్‌లో వినియోగిస్తున్నారో అర్ధం చేసుకోవచ్చు. హైదరాబాద్ చుట్టు పక్కల ఉన్న అన్ని జాతీయ రహదారుల ద్వారా డ్రగ్స్ హైదరాబాద్‌లోకి ఎంట్రీ ఇస్తున్నాయి. అది కూడా పోలీసుల కళ్లుగప్పి సిటీలోకి తీసుకు వస్తున్నారు.. ఐతే.. డ్రగ్ ఫ్రీ సిటీగా హైదరాబాద్‌ను మార్చేందుకు ప్రయత్నిస్తున్న.. ఈగల్ టీమ్ రైడ్స్ ముమ్మరం చేసింది. సిటీకి డ్రగ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఎవరు అమ్ముతున్నారు ? హైదరాబాద్‌లో ఎవరు కొనుగోలు చేస్తున్నారు? ఎక్కడి నుంచి ఎక్కడికి ఎలా సప్లై అవుతోంది? ఇలాంటి వాటిపై గట్టి నిఘా పెట్టింది ఈగల్ టీమ్. ముఖ్యంగా డ్రగ్స్‌ను పట్టుకునేందుకు కొత్త టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. మరోవైపు స్నిఫర్ డాగ్స్‌కు సైతం ప్రత్యేక శిక్షణ ఇచ్చి డ్రగ్స్ భరతం పడుతున్నారు..
READ MORE: HYD Drugs: ఐటీ సిటీ.. హైదరాబాద్ డ్రగ్స్‌కు అడ్డాగా మారుతోందా..?
ఐతే హైదరాబాద్‌లో సరఫరా అవుతున్న డ్రగ్స్‌లో సింహభాగం పబ్స్ నుంచే సప్లై అవుతోందని తెలుస్తోంది. దీంతో పబ్స్ పై గట్టి నిఘా పెట్టిన టీజీ న్యాబ్ పోలీసులు.. దొరికిన వారిని దొరికినట్టు అరెస్ట్ చేస్తున్నారు. ఇక డ్రగ్స్ వినియోగించిన వారితోపాటు పెడ్లర్లు, స్మగ్లర్లపై కఠినమైన సెక్షన్లు అమలు చేస్తున్నారు. నిజానికి పబ్ కల్చర్‌ను కంట్రోల్ చేయని పక్షంలో డ్రగ్స్ కట్టడి సాధ్యం కాదనేది నిపుణులు చెబుతున్నమాట. సో..డ్రగ్స్ సప్లై అవుతున్న పబ్స్‌పైనే దృష్టిసారించాలని వారు సూచిస్తున్నారు.. అంతకు ముందు తెలంగాణ పోలీసులు.. గోవా పెడ్లర్లపై దృష్టిసారించారు. అక్కడి నుంచి హైదరాబాద్‌కు సరఫరా అవుతున్న డ్రగ్స్‌ను నియంత్రించేందుకు ఆపరేషన్ నిర్వహించారు. కేవలం వారం రోజుల్లోనే రెండు మేజర్ గ్యాంగులను అరెస్ట్ చేశారు. వారు దాచి ఉంచిన డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. ఏకంగా 6.5 కోట్ల డ్రగ్స్ పట్టుకున్నారు. అంటే ఓ రకంగా ఆ మాదక ద్రవ్యాలు అన్నీ హైదరాబాద్‌కు సప్లై కాకుండా గోవాలోనే తుంచేశారు..
READ MORE: HYD Drugs: ఐటీ సిటీ.. హైదరాబాద్ డ్రగ్స్‌కు అడ్డాగా మారుతోందా..?
ఇటీవల తెలంగాణ ప్రభుత్వం డ్రగ్స్‌పై సీరియస్‌గా దృష్టిసారించింది. డ్రగ్స్ ను పట్టుకునేందుకు ఈగల్ టీమ్‌కు ఫుల్ పవర్స్ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. అంతే కాదు డ్రగ్స్ ఫ్రీ సిటీ కోసం అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన హీరోలు, నటులు ప్రచారం చేయాలని కోరారు. అటు విద్యా సంస్థలు కూడా యువత భవిష్యత్తు కోసం ఆలోచించాలని సూచించారు సీఎం రేవంత్. ఏదైనా విద్యా సంస్థ లేదా ఆ సంస్థ ఆవరణలో డ్రగ్స్ దొరికితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.మొత్తంగా డ్రగ్ ఫ్రీ సిటీ కావాలంటే నగరానికి అన్ని వైపులా ఉన్న రహదారుల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేయాలి. ప్రతి వాహనాన్ని క్షుణ్నంగా తనిఖీ చేసిన తర్వాతే సిటీలోకి అనుమతించాలి. లోకల్ పెడ్లర్లపై నిఘా పెంచాల్సిన అవసరం ఉందని నిపుణులు చెబుతున్నారు. అంతే కాదు పెడ్లర్లు, స్మగ్లర్లుగా పట్టుబడ్డ వారు.. మళ్లీ జైలు నుంచి బయటకు రాని విధంగా కఠిన సెక్షన్ల కింద కేసులు వేయాలని సూచిస్తున్నారు. అలాగే నైజీరియా నుంచి వచ్చే వారిపై మరింత నిఘా పెట్టాల్సిన అవసరం ఉంది..