NTV Telugu Site icon

ICC World Cup: సరికొత్త హంగులతో.. ప్రపంచకప్‌ 2023 మ్యాచ్‌లకు సిద్ధమవుతోన్న ఉప్పల్ స్టేడియం!

Uppal Stadium New

Uppal Stadium New

Uppal Stadium is Ready for ICC ODI World Cup 2023 with New Look: వన్డే ప్రపంచకప్‌ 2023 భారత్‌లో జరగనున్న విషయం తెలిసిందే. అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు మెగా టోర్నీ జరగనుంది. భారత్‌లోని మొత్తం 10 మైదానాల్లో ప్రపంచకప్‌ మ్యాచ్‌లు జరగనున్నాయి. హైదరాబాద్‌లోని ఉప్పల్‌ స్టేడియం (రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ స్టేడియం) కూడా ప్రపంచకప్‌ మ్యాచ్‌లకు ఆతిథ్యమివ్వనుంది. రెండు వార్మప్‌ మ్యాచ్‌లతో పాటు మూడు ప్రధాన మ్యాచ్‌లు ఉప్పల్‌ మైదానంలో జరగబోతున్నాయి. ఈ మ్యాచ్‌ల కోసం ఉప్పల్‌ స్టేడియం అంగరంగ వైభవంగా ముస్తాబవుతోంది.

గతంలో ఉప్పల్‌ మైదానంలో చాలా సమస్యలు ఉండేవి. ఓ వైపు పైకప్పు ఎగిరిపోయి, కుర్చీలు విరిగిపోయి, తాగునీరు ఇబ్బంది తదితర సమస్యలు ఉండేవి. ప్రపంచకప్‌ 2023 ఉన్న నేపథ్యంలో ఆ సమస్యలన్నింటినీ పరిష్కరించిన హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘం (హెచ్‌సీఏ).. ఉప్పల్‌ స్టేడియాన్ని సరికొత్తగా ముస్తాబు చేస్తోంది. ప్రస్తుతం స్టేడియం ఆధునీకీకరణ పనులు జోరుగా సాగుతున్నాయి. దక్షిణం వైపు వర్షాలకు ఎగిరిపోయిన పైకప్పు స్థానంలో కొత్తదాన్ని బిగించారు. తూర్పు పైకప్పు నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయి. కొత్త ఎల్‌ఈడీ ఫ్లడ్‌లైట్లు కూడా వచ్చేసాయి. 12 వేల కొత్త కుర్చీలు ఏర్పాటు చేయనున్నారు. ప్రపంచకప్‌ తర్వాత మిగతా కుర్చీలతో పాటు పశ్చిమ వైపు పైకప్పు కూడా సరి చేస్తారు.

వర్షం పడినా రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో నీరు నిలవకుండా ఉండటం కోసం.. డ్రైనేజీ వ్యవస్థనూ హెచ్‌సీఏ మెరుగుపరిచింది. కొత్త రంగులతో ఉప్పల్ స్టేడియంను అందంగా తీర్చిదిద్దుతున్నారు. ఇక అభిమానుల కోసం ఉచితంగా నాణ్యమైన తాగునీటి వసతిని హెచ్‌సీఏ అందించనుంది. మొట్టమొదటి సారి ప్రపంచకప్‌ మ్యాచ్‌లకు ఆతిథ్యమిచ్చేందుకు ఉప్పల్ స్టేడియం అందంగా సిద్ధమవుతోంది. హైదరాబాద్‌లో 27 ఏళ్ల తర్వాత ప్రపంచకప్‌ మ్యాచ్‌ జరగనుంది. చివరగా ఎల్బీ స్టేడియంలో 1996 ప్రపంచకప్‌లో (వెస్టిండీస్ vs జింబాబ్వే) మ్యాచ్‌ జరిగింది.

Also Read: Flipkart Big Billion Days 2023: ఫ్లిప్‌కార్ట్ ‘బిగ్’ బిలియన్ ఆఫర్.. 20 వేల స్మార్ట్‌ఫోన్ కేవలం 10 వేలకే!

వన్డే ప్రపంచకప్‌ 2023షెడ్యూల్‌ను బీసీసీఐ ప్రకటించగానే.. తెలుగు రాష్ట్రాల క్రికెట్‌ అభిమానులు ఎంతగానో నిరాశపడ్డారు. ఇందుకు కారణం ఒక్క భారత్ మ్యాచ్‌ కూడా ఉప్పల్ స్టేడియంలో లేకపోవడం. ఈసారి ఉప్పల్‌ స్టేడియంలో అయిదు మ్యాచ్‌లు జరగనున్నాయి. ఇందులో రెండు వార్మప్‌ మ్యాచ్‌లు ఉండగా.. మూడు ప్రధాన మ్యాచ్‌లు ఉన్నాయి. ఈ నెల 29న పాకిస్థాన్, న్యూజిలాండ్‌ మధ్య మొదటి వార్మప్‌ మ్యాచ్‌ ఉండగా.. అక్టోబర్‌ 3న ఆస్ట్రేలియా, పాకిస్థాన్‌ మధ్య రెండో వార్మప్‌ మ్యాచ్‌ ఉంది. అక్టోబర్‌ 6న నెదర్లాండ్స్‌-పాకిస్థాన్, అక్టోబర్‌ 9న నెదర్లాండ్స్‌-న్యూజిలాండ్, అక్టోబర్‌ 10న శ్రీలంక-పాకిస్థాన్‌ జట్లు తలపడతాయి.