నేటి ఆధునిక జీవనశైలిలో భాగమైన ఫాస్ట్ ఫుడ్ సంస్కృతి హైదరాబాద్ యువత ఆరోగ్యాన్ని నిలువునా ముంచేస్తోంది. నగరంలోని 18 నుంచి 24 ఏళ్ల లోపు కాలేజీ విద్యార్థులపై ఐసీఎమ్ఆర్ – నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ శాస్త్రవేత్తలు తాజాగా నిర్వహించిన పరిశోధనలో నమ్మలేని, భయానక నిజాలు వెలుగులోకి వచ్చాయి. అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ విపరీతంగా తినడం వల్ల చిన్న వయసులోనే ప్రాణాంతక వ్యాధుల బారిన పడుతున్నారు. కేవలం రుచి, తక్కువ ధర, సులభంగా దొరుకుతుందనే కారణంతో యువత వీటిని ఎగబడి తింటున్నారు. కానీ.. ఈ అలవాటు వారి జీవితకాల ఆరోగ్యాన్ని, ముఖ్యంగా గుండె పనితీరును ప్రమాదంలోకి నెడుతోందని శాస్త్రవేత్తలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ప్లేట్‌లోకి మృత్యువు..
మీరు అమితంగా ఇష్టపడే ప్యాకెట్ స్నాక్స్, చాక్లెట్లు, రంగురంగుల షుగర్ డ్రింక్స్, పిజ్జాలు, బర్గర్లు నేరుగా మీ ప్రాణాల మీదకు తెస్తున్నాయని ఈ స్టడీ హెచ్చరిస్తోంది. ఈ అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకునే యువతలో రక్తపోటు ముప్పు సాధారణం కంటే మూడు రెట్లు అధికంగా పెరుగుతోంది. ఇది అంచనా కాదు.. శాస్త్రవేత్తలు 311 మంది కాలేజీ విద్యార్థులపై క్లినికల్ పరీక్షలు చేసి తేల్చిన నిప్పులాంటి నిజం.
అధ్యయనంలో ఏం తేలాయంటే..
పరీక్షించిన వారిలో 12.5 శాతం మంది యువతకు ఇప్పటికే హై బీపీ ఉన్నట్లు తేలింది. 20 ఏళ్లు కూడా నిండని వయసులో బీపీ రావడం భవిష్యత్తులో పక్షవాతం, కిడ్నీ వైఫల్యానికి దారితీస్తుంది. ఈ కెమికల్స్, నిల్వ పచ్చళ్లు, ప్రాసెస్డ్ ఫుడ్స్ వల్ల రక్తనాళాలు పూడుకుపోయి, చిన్న వయసులోనే గుండెపోటు వచ్చే అవకాశాలు వంద శాతం పెరుగుతున్నాయి. రుచి కోసం వాడే మోనోసోడియం గ్లుటామేట్ (అజినోమోటో), అధిక సోడియం, శాచ్యురేటెడ్ ఫ్యాట్స్ యువతను వీటికి బానిసలుగా మారుస్తున్నాయి.
ఇకనైనా మారకపోతే ముప్పే..
ఈ ప్రమాదం నుంచి యువతను రక్షించాలంటే కాలేజీల స్థాయిలో ప్రత్యేక ఫుడ్ అవేర్‌నెస్ కార్యక్రమాలు అత్యవసరమని ICMR-NIN శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. ఇంట్లో వండిన సాంప్రదాయ, ఆరోగ్యకరమైన ఆహారానికి ప్రాధాన్యత ఇవ్వకపోతే.. రాబోయే తరం ముసలితనం రాకముందే మంచాన పడక తప్పదని హెచ్చరిస్తున్నారు. ప్రాణం మీదకు తెచ్చుకునే కంటే.. నాలుక రుచిని నియంత్రించుకోవడం ఈ క్షణం నుంచే అవసరం.
