శ్రీరామ నవమి వేడుకల సందర్భంగా మద్యం విక్రయాలపై పోలీసులు నిషేధం విధించారు. నేటి ఉదయం ఉదయం 6 గంటల నుంచి రేపు ( గురువారం ) ఉదయం 6 గంటల వరకు మద్యం అమ్మకాలను బంద్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్ నగరంలోని మూడు కమిషనరేట్ల పరిధిలోని మద్యం దుకాణాలు, కల్లుకాంపౌండ్‌లు, బార్ అండ్ రెస్టారెంట్లలో మద్యం విక్రయాలు నిలిపివేయాలని పేర్కొన్నారు. షాపుల యజమానులు ఈ విషయాన్ని గమనించి మద్యం విక్రయాలను క్లోజ్ చేయాలని తెలిపారు. ఎక్కడైనా మద్యం విక్రయాలు జరిగినట్లు సమాచారం అందితే ఆ షాపు యజమానులపై తప్పనిసరిగా కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు.
Read Also: KCR: కేసీఆర్‌కు నోటీసు ఇచ్చిన ఈసీ.. రేవంత్ రెడ్డి మీద చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో..!
హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో శాంతి భద్రతల దృష్ట్యా వైన్ షాపులు మూసివేస్తున్నట్లు పోలీసులు ప్రకటించారు. ఇక, నేడు వైన్ షాపులు బంద్ అని తెలియడంతో నిన్న ( మంగళవారం ) మందుబాబులు మద్యం దుకాణాల దగ్గర క్యూ కట్టారు. నిన్న ఎత్తున బీర్లను కొనుగోలు చేయడంతో స్టాక్ పూర్తిగా అయిపోయినట్లు మద్యం షాప్స్ ప్రకటించాయి. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో బ్రాండెడ్ బీర్లు దొరకని పరిస్థితి కొనసాగుతుంది. రేషన్ ఆధారంగా ప్రధాన బ్రాండ్ల బీర్లను ఒక్కో షాపునకు 20-25 కేస్ లు ఇస్తుండగా.. ఇవి సరిపోవడంలేదని మద్యం దుకాణాల యజమానులు వాపోతున్నారు. అయితే, హైదరాబాద్ పరిధిలో దాదాపుగా 12 లక్షల కేస్‌లకు పైగా బీర్ల అమ్మకాలు జరిగితే.. ప్రస్తుతం 15 లక్షల కేస్‌లకు పైగా డిమాండ్ పెరిగిందని వ్యాపారులు అంటున్నారు. రాష్ట్రంలో ప్రతి నెలా 28 నుంచి 30 లక్షల కేస్ ల బీర్లు విక్రయాలు జరుగుతాయని పలు గణాంకాలు చెబుతున్నాయి.
