Hyderabad Traffic Alert: ఉప్పల్ రింగ్ రోడ్డు క్లోజ్.. నగర, వరంగల్-హైదరాబాద్ ప్రయాణికులకు రూట్ మ్యాప్ ఇదే..

Uppal Ring Road2

Uppal Ring Road2

Hyderabad Traffic Alert: హైదరాబాద్‌లో ట్రాఫిక్‌కు సంబంధించి కీలక ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. ఉప్పల్ రింగ్ రోడ్‌పై రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేస్తూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఉప్పల్–నారపల్లి ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణ పనుల కారణంగా మూడు నెలల పాటు ఉప్పల్ రింగ్ రోడ్డును మూసివేయనున్నట్లు మల్కాజ్‌గిరి మున్సిపల్ కార్పొరేషన్, నగర ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు. దీంతో వరంగల్ నుంచి హైదరాబాద్‌కు వచ్చే వాహనాలు, అలాగే హైదరాబాద్ నుంచి వరంగల్ వైపు వెళ్లే వాహనాలను ప్రత్యామ్నాయ మార్గాలకు మళ్లించనున్నారు. అదేవిధంగా భారీ వాహనాలకు ప్రత్యేక ఆంక్షలు విధించగా, వాటికి ఘట్‌కేసర్ వరకు మాత్రమే అనుమతి ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు. ప్రజలు ముందుగానే తమ ప్రయాణాలను ప్లాన్ చేసుకోవాలని, ట్రాఫిక్ మళ్లింపులపై అధికారుల సూచనలు పాటించాలని విజ్ఞప్తి చేశారు.

ప్రత్యామ్నాయ మార్గాలపై అధికారులు ఓ క్లారిటీ ఇచ్చారు. జీహెచ్‌ఎంసీ కార్యాలయం పక్కనే ఉన్న వరంగల్, హన్మకొండ, యాదగిరిగుట్ట బస్టాప్‌ను తాత్కాలికంగా నల్లచెరువు కట్ట ప్రాంతానికి మార్చారు. వరంగల్ నుంచి హైదరాబాద్ వచ్చే వాహనాలు.. మేఫేర్ హోటల్ దాటిన తర్వాత ‘ఉప్పల్ భగాయత్ లేఅవుట్’ మీదుగా నాగోల్ చేరుకోవాలి. అక్కడ సర్వీస్ రోడ్డు గుండా వెళ్లి, ఫ్లైఓవర్ కింద యూటర్న్ తీసుకుని నగరంలోకి ఎంట్రీ అవ్వాల్సి ఉంటుంది. హైదరాబాద్ నుంచి వరంగల్ వెళ్లే వాహనాలు, సర్వే ఆఫ్ ఇండియా జంక్షన్ వద్ద పిస్తా హౌస్, బీరప్పగడ్డ మీదుగా జాతీయ రహదారి 163 (NH 163) కి చేరుకోవాలి. పీర్జాదిగూడ నుంచి సికింద్రాబాద్ వెళ్లే వాహనాలు.. ఉప్పల్ జంక్షన్‌కు రాకుండా, లక్ష్మారెడ్డి కాలనీ మీదుగా ఉప్పల్ మెట్రో స్టేషన్ సమీపంలోని మాస్టర్ చెఫ్ రెస్టారెంట్ వద్దకు చేరుకుని అక్కడ యూటర్న్ తీసుకోవాల్సి ఉంటుందని ట్రాఫిక్ పోలీసులు స్పష్టం చేశారు. ఉప్పల్ భగాయత్ రోడ్డు చాలా ఇరుకైనది కావడంతో భారీ వాహనాలను ఆ మార్గంలో అనుమతించడం లేదు. వాటి కోసం ప్రత్యేక మార్గాలను కేటాయించారు. వరంగల్ నుంచి హైదరాబాద్ వచ్చే భారీ వాహనాలు ఘట్‌కేసర్ వద్దే ఔటర్ రింగ్ రోడ్ ఎక్కి, హయత్‌నగర్ లేదా పెద్ద అంబర్‌పేట మీదుగా ఎల్బీనగర్ చేరుకోవాలి. సికింద్రాబాద్, రామంతాపూర్, హబ్సీగూడ నుంచి వరంగల్ వెళ్లే భారీ వాహనాలు నాచారం, మల్లాపూర్, ఐఓసీ (IOC) జంక్షన్, చెంగిచర్ల మీదుగా వరంగల్ హైవేకి వెళ్లాల్సి ఉంటుంది. అటుగా వెళ్లే ప్రయాణికులు ముందుగా పూర్తి వివరాలు తెలుసుకుని కొంచెం ముందుగా ప్రయాణం ప్రారంభించండి.