Hyderabad: ఏఐ ఫొటో తెచ్చిన ప్రాణసంకటం.. ప్రిన్సిపల్, లెక్చరర్ వేధింపులతో విద్యార్థి బలి

Hyd News

Hyd News

Hyderabad: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)తో సృష్టించిన ఒక ఫొటో ఓ నిరుపేద విద్యార్థి ప్రాణం తీసే స్థాయికి చేరింది. కళాశాల ప్రిన్సిపల్, లెక్చరర్ చేసిన అవమానం, వేధింపులు తాళలేక ఆ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన విషాద ఘటన ఎస్సార్‌ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగుచూసింది.

అసలేం జరిగింది?
పోలీసుల కథనం ప్రకారం.. నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండలం చౌటుబాయి గ్రామానికి చెందిన కట్టా భానుప్రసాద్‌రెడ్డి (20) బల్కంపేట బీకేగూడలోని ‘చెన్నైస్ అమృత గ్రూప్ ఆఫ్ ఇన్‌స్టిట్యూషన్స్’లో హోటల్ మేనేజ్‌మెంట్ సెకండియర్ చదువుతున్నాడు. ఎస్సార్‌నగర్‌లోని వెంకటేశ్వర ఆలయం సమీపంలో స్నేహితులతో కలిసి రూమ్‌లో ఉంటూ, కుటుంబ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఖర్చుల కోసం ‘జెప్టో’లో డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు. తొమ్మిది రోజుల క్రితం భానుప్రసాద్ ఏఐ టెక్నాలజీ ద్వారా తమ కళాశాల లెక్చరర్ భాస్కర్‌ ఓ మహిళతో కలిసి ఉన్నట్లు ఫొటో సృష్టించి క్లాస్‌మేట్‌కు చూపించాడు. సదరు క్లాస్‌మేట్ ఆ విషయాన్ని లెక్చరర్‌కు చేరవేయడంతో, ఆయన ప్రిన్సిపల్ చంద్రమోహన్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో ప్రిన్సిపల్, లెక్చరర్ భానుప్రసాద్‌ను తీవ్రంగా మందలించి, సైబర్ క్రైమ్ పోలీసులకు పట్టిస్తామని బెదిరించి అతని మొబైల్ ఫోన్‌ను లాక్కున్నారు. పొరపాటు జరిగిందని కాళ్లావేళ్లా పడినా వారు కనికరించలేదు. చివరకు గచ్చిబౌలిలో ఉంటున్న తన సోదరుడు ప్రవీణ్‌రెడ్డిని పిలిపించి బతిమాలినా ఫోన్ ఇవ్వకుండా, కేవలం సిమ్ కార్డు మాత్రమే చేతిలో పెట్టారు.

ఫోన్ లేక.. పనుల్లేక తీవ్ర మానసిక క్షోభ:
ఫోన్ కోసం కళాశాలకు వెళ్లిన ప్రతిసారీ ప్రిన్సిపల్ అతడిని గంటల తరబడి నిలబెట్టి మానసిక వేదనకు గురిచేశారు. చేతిలో మొబైల్ లేకపోవడంతో ఆన్‌లైన్ డెలివరీ పనులకు వెళ్లలేకపోయాడు. దీంతో సంపాదన ఆగిపోయి రూమ్ అద్దె బకాయి పడటంతో మరింత మనోవేదనకు లోనయ్యాడు. శుక్రవారం ఉదయం కళాశాలకు వెళ్లి ఫోన్ తిరిగి ఇవ్వాలని కోరగా, సాయంత్రం వరకు నిలబెట్టి తిప్పిపంపారు.
దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన భానుప్రసాద్ సాయంత్రం రూమ్‌కు చేరుకున్నాడు. రాత్రి 7:30 గంటల సమయంలో స్నేహితుడితో కలిసి బయటకు వెళ్లి పానీపూరి తిని తిరిగి వచ్చాడు. రూమ్‌మేట్స్ ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. రాత్రి 9 గంటలకు రూమ్‌మేట్ వచ్చి తలుపు కొట్టగా స్పందన లేకపోవడంతో కిటికీలోంచి చూడగా విగతజీవిగా కనిపించాడు.

కళాశాల వద్ద ఉద్రిక్తత.. నిందితుల అరెస్ట్:
విద్యార్థి ఆత్మహత్య విషయం తెలియడంతో ఎన్‌ఎస్‌యూఐ నాయకులు, విద్యార్థులు శనివారం కళాశాల ఎదుట ఆందోళనకు దిగారు. ప్రాంగణంలోకి చొచ్చుకెళ్లి ఫర్నిచర్‌ను ధ్వంసం చేయడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చి పికెట్ ఏర్పాటు చేశారు. మృతుడి సోదరుడు ప్రవీణ్‌రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ప్రిన్సిపల్ చంద్రమోహన్, లెక్చరర్ భాస్కర్‌లను పోలీసులు అరెస్టు చేశారు.