అదనపు ఆదాయం కోసం చాలా మంది ప్రయత్నిస్తుంటారు. చిన్న చితకా ఉద్యోగాలు చేసే వారికి అయితే అదనపు ఆదాయం చాలా అవసరం ఉంటుంది. తద్వారా ఆర్ధికంగా బలపడదామని భావిస్తారు. కానీ కొంత మంది మాత్రం అదనపు ఆదాయం కోసం అడ్డదారులు తొక్కుతున్నారు. సరిగ్గా ఇదే రీతిలో ప్రయత్నించిన సెక్యూరిటీ గార్డులు ఏకంగా గంజాయి వ్యాపారం షురూ చేశారు. చివరకు పోలీసులకు దొరికిపోయారు.
బీహార్‌కు చెందిన అర్జున్ కుమార్ అనే వ్యక్తి ఎడన్ బాగ్‌లో నివాసం ఉంటున్నాడు. అమృత కపాడియా నవజీవన్ ఉమెన్స్ కాలేజీలో సెక్యూరిటీ గార్డ్‌గా పనిచేస్తున్నాడు. అదే బీహార్‌కు చెందిన రాహుల్ పండరి అనే వ్యక్తి మరోచోట సెక్యూరిటీ గార్డ్‌గా పని చేస్తున్నాడు. ఒకే రాష్ట్రం కావడంతో స్నేహం కుదిరింది. ఇద్దరికీ సెక్యూరిటీ గార్డు డ్యూటీ ద్వారా వచ్చే ఆదాయం అంతంత మాత్రమే. దీంతో అదనపు ఆదాయం కోసం గంజాయి అమ్మాలని డిసైడ్ అయ్యారు. అనుకున్నదే తడవుగా గంజాయి తీసుకు వచ్చి హైదరాబాద్లోని పలు కాలేజీల్లో విద్యార్థులకు అమ్మడం స్టార్ట్ చేశారు.
ఐతే ఆ నోటా ఈ నోటా.. వీళ్ల ఇద్దరి గంజాయి వ్యాపారం కాస్తా పోలీసులకు సమాచారం అందింది. దీంతో రాహుల్ పండరి వద్ద గంజాయి ఉందనే పక్కా సమాచారంతో పోలీసులు దాడి చేశారు. కానీ అదే సమయంలో తన వద్ద ఉన్న గంజాయిని అర్జున్ కుమార్ వద్ద నిల్వ చేసి బీహార్‌కు పారిపోయాడు రాహుల్. కానీ పోలీసులు రాగానే వారికి గంజాయితో సహా అర్జున్ కుమార్ పట్టుబడ్డాడు. అతని వద్ద నుంచి 7.2 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. నిందితున్ని నారాయణగూడ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
