Site icon NTV Telugu

HYD Harassment: యువతులు, మహిళలను తాకుతూ శునకానందం.. వందలాది మంది ఆకతాయిలపై కేసులు!

Hyd Harassment

Hyd Harassment

హైదరాబాద్‌లో పోకిరీల ఆగడాలు మితిమీరాయి. బోనాలు.. వినాయక వేడుకలు.. దేవీ నవరాత్రులు.. న్యూ ఇయర్‌.. హోలీ.. సందర్భమేదైనా సరే ఆకతాయిల టార్గెట్‌ అంతా అమ్మాయిలపైనే. కామెంట్‌ చేయడం.. యువతులను, మహిళలను తాకుతూ, వీడియోలు, ఫొటోలు తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తూ.. శునకానందం పొందుతున్నారు. తాజాగా బైక్‌ వెళ్తున్న మహిళలను.. యువకులు వెంబడిస్తూ నెమలి ఈకతో టచ్‌ చేస్తూ అసభ్యంగా ప్రవర్తించారు. వైరల్‌ ఐన వీడియో ఆధారంగా యువకులను గుర్తించి పట్టుకుని తాట తీశారు పోలీసులు.

హైదరాబాద్‌ నగర వ్యాప్తంగా తాజాగా జరిగిన బోనాల ఉత్సవాల్లో ఆకతాయిలు రెచ్చిపోయారు. యువతులు, మహిళలను తాకుతూ శునకానందం పొందారు. ఇందులో యువకులే కాదు.. అంకుల్స్‌ కూడా ఉన్నారు. ఇలాంటి వాళ్లందరి తాట తీశారు పోలీసులు. వాళ్లు చేస్తున్న వికృత చేష్టలను షీ టీమ్స్‌ వీడియోలతో సహా రికార్డ్‌ చేసింది. గుర్తించి పట్టుకుని కేసులు నమోదు చేశారు పోలీసులు. ఇలా బోనాలు ముగిసే వరకు వందలాది మంది ఆకతాయిలపై కేసులు పెట్టారు.

తాజాగా మాదాపూర్‌లో కుర్రాళ్లు రెచ్చిపోయారు. బైక్‌ వెళ్తున్న యువతులను.. ముగ్గురు యువకులు బైక్‌పై వెంబడించడమే కాకుండా… వెనక కూర్చున్న యువకుడు నెమలి ఈకతో యువతులను కొడుతూ వేధించాడు. ఇలా కొద్ది దూరం వరకు వెంబడించి యువతులతో అసభ్యంగా ప్రవర్తించారు. ముగ్గురు యువకుల ప్రవర్తనతో భయాందోళనకు గురైన యువతులు బైక్‌ను వేగంగా పోనిచ్చే ప్రయత్నం చేశారు. ఐనా యువకులు వెంబడించారు. ఈ తతంగం అంతా… వెనకాలే వస్తున్న కారులోని మహిళ తన మొబైల్‌ ఫోన్‌తో రికార్డ్‌ చేసింది. యువకుల బైక్‌ సమీపం వరకు వెళ్లి.. వారించింది. ఏం చేస్తున్నారు.. అంటూ మందలించింది. దీంతో ఆ ముగ్గురు యువకులు స్పీడ్‌గా వెళ్లిపోయారు.

మొబైల్‌ ఫోన్‌తో రికార్డ్‌ చేసిన మహిళ.. ఆ వీడియోను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తూ.. పోలీసులకు ట్యాగ్‌ చేసింది. సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిన వీడియోను గుర్తించిన పోలీసులు.. ఆ బైక్‌ నెంబర్‌ ఆధారంగా యువకులను గుర్తించారు. వరంగల్‌ కి చెందిన ముగ్గురు యువకులు.. హైదరాబాద్‌లోనే ఉంటున్నట్లు గుర్తించారు. చదువు, ఉద్యోగం లేకుండా.. జులాయిగా తిరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకున్న మాదాపూర్‌ పోలీసులు.. యువకుల తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. యువకులకు కౌన్సిలింగ్‌ ఇచ్చారు పోలీసులు. ముగ్గురిపై కేసులు నమోదు చేశారు పోలీసులు.

ఎవరూ గమనించరు కదా అని తుంటరి చేష్టలకు పాల్పడినా.. యువతులు, మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించినా తాట తీస్తామని హెచ్చరిస్తున్నారు పోలీసులు. రానున్న వినాయక నిమజ్జనం, దేవీ నవరాత్రుల ఉత్సవాల్లోనూ ఇలాంటి చేష్టలకు పాల్పడే వాళ్లపై పోలీసుల నజర్‌ ఉంటుందని.. పిచ్చి చేష్టలకు పాల్పడితే కేసులు తప్పవని వార్నింగ్‌ ఇస్తున్నారు.

Exit mobile version