Hyderabad: హైదరాబాద్ లోని పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక హోటల్ గదిలో ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరుకు చెందిన యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం కలకలం రేపింది. గుంటూరు ప్రాంతానికి చెందిన కోట శ్రీరామ్ (29), స్థానిక బ్రాడీపేటలోని ఓ ప్రైవేట్ థియేటర్లో కస్టమర్ కేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. ఇటీవల థియేటర్‌కు చెందిన నగదు, మొబైల్ ఫోన్‌తో పాటు ఫోన్‌పే ద్వారా రూ.99,999లను శ్రీరామ్ తన ఖాతాకు బదిలీ చేసుకున్నాడని థియేటర్ యజమాని ఆరోపించారు. ఈ వ్యవహారంపై యజమాని సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, అధికారులు శ్రీరామ్ బ్యాంకు ఖాతాను ఫ్రీజ్ చేశారు.
వీడియో సందేశం పంపి..
ఈ పరిణామాల నేపథ్యంలో హైదరాబాద్‌కు వచ్చిన శ్రీరామ్, చౌదరిగూడ ఓయూ కాలనీ రోడ్ నంబర్ 4 లోని ‘లివింగ్ ట్రీ ఓయో’ హోటల్లో బస చేశాడు. ఈ నెల 27వ తేదీ ఉదయం తన పరిస్థితిని వివరిస్తూ తల్లికి, థియేటర్ యజమానికి ఒక వీడియో సందేశం పంపాడు. అందులోనే తాను ఉన్న హోటల్ వివరాలు, లొకేషన్‌ను కూడా షేర్ చేశాడు. ఆ వీడియో చూసి ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు వెంటనే హోటల్ సిబ్బందికి సమాచారం అందించారు. హోటల్ సిబ్బంది శ్రీరామ్ బస చేసిన గది వద్దకు వెళ్లి తలుపులు తెరిచి చూడగా, అతను అప్పటికే విగతజీవిగా పడి ఉన్నాడు. సమాచారం అందుకున్న పోచారం ఐటీ కారిడార్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతుడి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు క్రైమ్ నంబర్ 649/2026 కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. శ్రీరామ్ మృతికి గల కచ్చితమైన కారణాలు పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది.

