Pocharam Milk Adulteration: రంగారెడ్డి జిల్లాలో కల్తీ పాల తయారీ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఇబ్రహీంపట్నం మండలం పోచారం గ్రామంలో ఓ ఇంట్లో అక్రమంగా కల్తీ పాలు తయారు చేస్తున్నట్లు సమాచారం అందుకున్న మహేశ్వరం ఎస్ఓటీ పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారు. ఈ కేంద్రంలో తయారైన కల్తీ పాలను హైదరాబాద్‌లోని వినియోగదారులకు సరఫరా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. కల్తీ పాలు, హైడ్రోజన్ పెరాక్సైడ్, ధోల్పూర్ పాలపొడి ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు.
పోచారం గ్రామానికి చెందిన అండే శ్రీశైలం (43) పాల వ్యాపారం నిర్వహిస్తున్నాడు. పాలలో హైడ్రోజన్ పెరాక్సైడ్, ధోల్పూర్ పాలపొడిని కలిపి కల్తీ పాలు తయారు చేస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. అండే శ్రీశైలం ఇంట్లో దాడులు చేయగా.. అసలు విషయం బయటపడింది. దాడుల సందర్భంగా పోలీసులు 100 లీటర్ల కల్తీ పాలు, ఒక లీటరు హైడ్రోజన్ పెరాక్సైడ్, ఒక్కో కిలో బరువున్న 35 ధోల్పూర్ పాలపొడి ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారానికి సంబంధించి శ్రీశైలాన్ని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ఈ కల్తీ పాలను హైదరాబాద్‌లో విక్రయించేందుకు సరఫరా చేస్తున్నట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. శ్రీశైలంపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

