Metro RTC Combo Pass Prices Reduced: తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ప్రభుత్వం ‘దీపావళి’ కానుక ప్రకటించింది. మెట్రో, ఆర్టీసీ సేవలను కలిపి వినియోగించుకునే ఉమ్మడి ప్రయాణ పాస్ ధరలను భారీగా తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. ప్రజలపై ప్రయాణ ఖర్చుల భారాన్ని తగ్గించి.. ప్రజా రవాణా సేవలను మరింత అందుబాటులోకి తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన తెలిపారు. ప్రస్తుతం రూ.400గా ఉన్న రోజువారీ ఉమ్మడి ప్రయాణ పాస్ ధరను రూ.275కు తగ్గించినట్లు మంత్రి పేర్కొన్నారు. ఇందులో రూ.200 మెట్రో ప్రయాణానికి, రూ.75 ఆర్టీసీ ప్రయాణానికి కేటాయించారు. ఈ పాస్‌తో రోజుకు గరిష్టంగా నాలుగు సింగిల్ జర్నీలు చేసుకునే అవకాశం ఉంటుందని మంత్రి వివరించారు.
అదేవిధంగా ప్రస్తుతం రూ.8,500గా ఉన్న నెలవారీ ఉమ్మడి ప్రయాణ పాస్ ధరను ఏకంగా రూ.4,000కు తగ్గించారు. ఇందులో రూ.3,000 మెట్రో ప్రయాణానికి.. రూ.1,000 ఆర్టీసీ ప్రయాణానికి కేటాయించినట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఈ పాస్ ద్వారా నెలలో గరిష్టంగా 50 రౌండ్ ట్రిప్పులు చేసుకోవచ్చని వెల్లడించారు. ఈ ధరల తగ్గింపుతో నెలవారీ ఉమ్మడి పాస్ వినియోగదారులకు రూ.4,500 వరకు ఆదా అవుతుందని మంత్రి పేర్కొన్నారు. రోజువారీ పాస్ వినియోగదారులకు ఒక్కో పాస్‌పై రూ.125 ఆదా అవుతుందని తెలిపారు. ఉద్యోగులు, విద్యార్థులు సహా నిత్యం మెట్రో, ఆర్టీసీ సేవలను ఉపయోగించుకునే ప్రయాణికులకు ఈ నిర్ణయం ఆర్థికంగా ఊరటనివ్వనుంది.
ప్రభుత్వం ప్రకటించిన తగ్గింపు ధరలు నవంబర్ 8వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి. ఇందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని సంబంధిత సంస్థలను ప్రభుత్వం ఆదేశించినట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ప్రజల సంక్షేమం, ప్రయాణికుల ఆర్థిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని మంత్రి పేర్కొన్నారు. మెట్రో, ఆర్టీసీ ఉమ్మడి ప్రయాణ పాస్‌ల ధరలు తగ్గడంతో హైదరాబాద్‌లో నిత్యం ప్రజా రవాణాపై ఆధారపడే ప్రయాణికులకు గణనీయమైన ఊరట లభించనుంది.

