Bus Fire Accident: మీర్‌పేట్‌లో బస్సులో భారీ అగ్నిప్రమాదం.. తృటిలో తప్పిన పెను ప్రమాదం!

Meerpet Bus Fire

Meerpet Bus Fire

Bus Fire Accident: హైదరాబాద్‌లోని మీర్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో బస్సులో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. దర్శనం కోసం శ్రీశైలం వెళ్తున్న ప్రయాణికుల బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. అయితే డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడ్డారు.

నాగోల్‌కు చెందిన శ్రీ మహాలక్ష్మి రియల్ ఎస్టేట్ సంస్థకు చెందిన సుమారు 150 మంది గణేష్ విగ్రహ నిమజ్జనం, దర్శనం కోసం మూడు బస్సుల్లో శ్రీశైలానికి బయలుదేరారు. ఈ క్రమంలో రాత్రి సుమారు 2 గంటల సమయంలో గాయత్రి నగర్ సమీపంలోని హెచ్‌పీ పెట్రోల్ బంక్ వద్ద రెండు బస్సుల్లో డీజిల్ పోస్తున్నారు.

అదే సమయంలో ప్రధాన రహదారిపై నిలిపి ఉంచిన TS15T8558 నంబర్ గల శ్రీ లక్ష్మీ నరసింహ ట్రావెల్స్ బస్సులో కుడివైపు ఇంజిన్ భాగం నుంచి అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. మంటలను గమనించిన డ్రైవర్ వెంటనే బస్సు నుంచి దిగి ప్రయాణికులను అప్రమత్తం చేశారు. దీంతో ప్రయాణికులంతా వెంటనే బస్సు నుంచి బయటకు వచ్చారు.

ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ప్రయాణికుల్లో ఎవరికీ గాయాలు కూడా కాలేదు. అయితే మంటలు వేగంగా వ్యాపించడంతో బస్సు పూర్తిగా దగ్ధమై భారీగా నష్టం వాటిల్లింది. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు. ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకుని.. ప్రయాణికులు, ఇతర వాహనదారులకు ఎలాంటి ప్రమాదం జరగకుండా చర్యలు చేపట్టారు. బస్సులో మంటలు చెలరేగడానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.