Hyderabad Man In Russia: గల్ఫ్ మోసాలు చూస్తూనే ఉంటాం. ఏమీ తెలియని.. చదువు రాని అమాయకులను.. ఏజెంట్లు మోసం చేస్తుంటారు. హైదరాబాద్‌లో చదువు ఉండి కూడా ఓ యువకుడు కన్సల్టెన్సీ చేతిలో మోసపోయాడు. రష్యాకు వెళ్లిన అతడికి దుర్భర పరిస్థితులు ఎదురయ్యాయి. సెల్ఫీ వీడియోలో తన బాధ చెప్పుకుని రక్షించాలని వేడుకుంటున్నాడు. ఇంతకూ రష్యాలో అతడికి ఎదురైన అనుభవం ఏంటి? ఆ యువకుడి పేరు మహ్మద్ అహ్మద్. ఇతడు దళారుల చేతుల్లో మోసపోయి.. రష్యాలో చిక్కుకున్నాడు. అంతే కాదు రష్యా తరఫున.. ఉక్రెయిన్ యుద్ధంలో పాల్గొనాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ విషయం అతడు సెల్ఫీ వీడియోలో చెబితే బయటకు తెలిసింది..
READ ALSO: Tragedy: చిన్న గొడవ చివరకు.. కన్న కొడుకు కళ్లముందే మహిళను..
హైదరాబాద్‌లోని రాజ్‌భవన్ ఎదురుగా నివసించే మహ్మద్ అహ్మద్ ఉద్యోగాన్వేషణ చేస్తున్నాడు. ఆ సమయంలో అతనికి ముంబైలోని ట్రస్ట్ కన్సల్టెన్సీ అనే సంస్థ యజమాని ఆదిల్ పరిచయమయ్యాడు. రష్యాలోని ఒక నిర్మాణ సంస్థలో ఉద్యోగం కల్పిస్తానని ప్రలోభపెట్టాడు. ఆదిల్ చెప్పిన మాటలను నమ్మిన మహ్మద్ అహ్మద్ 2025 ఏప్రిల్ 25న భారత్ నుంచి రష్యాకు బయలుదేరాడు. అయితే అక్కడకు వెళ్లిన తరువాత నెలరోజులు ఏ పని ఇవ్వలేదు. అనంతరం అతడిని మరో 30 మందితో పాటు ఒక దూరప్రాంతానికి తరలించి బలవంతంగా ఆయుధాల శిక్షణ ఇచ్చారు. ఆ 30 మందిలో ఆరుగురు భారతీయులు ఉన్నట్లు సమాచారం…
శిక్షణ పూర్తైన తర్వాత వారిలో 26 మందిని ఉక్రెయిన్ సరిహద్దుకు పంపించి యుద్ధం చేయమని బలవంతం చేశారు. ఈ సమయంలో మహ్మద్ అహ్మద్ సైనిక వాహనం నుంచి దూకి తప్పించుకోవడానికి ప్రయత్నించగా.. కుడి కాలు విరిగిపోయింది. మహ్మద్‌తోపాటు వెళ్లిన వారిలో 17 మంది మరణించినట్లు తెలుస్తోంది. అంతే కాదు.. ప్రస్తుతం మహ్మద్ అహ్మద్‌ను యుద్ధంలో పాల్గొను.. లేకపోతే చంపేస్తామని రష్యా అధికారులు బెదిరిస్తున్నట్లు సమాచారం… మరోవైపు మహ్మద్ అహ్మద్ కుటుంబ పరిస్థితి కూడా దయనీయంగా ఉంది. ఆయన కుటుంబంలో పక్షవాతం బారినపడిన తల్లి, భార్య, ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు. కుటుంబానికి ఏకైక ఆధారంగా ఉన్న మహ్మద్ అహ్మద్ రష్యాలో చిక్కుకుపోవడంతో కుటుంబ సభ్యుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. భారత ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకుని మహ్మద్ అహ్మద్‌ను రక్షించాలని కుటుంబ సభ్యులు, స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు…
READ ALSO: Andhra Pradesh Student Suicides: విద్యార్థుల ఉసురు తీసిన అవమానం..
