Independence day Celebrations: త్వరలోనే స్వాతంత్ర దినోత్సవం రాబోతుంది. ఇప్పటికే ఈ వేడుకకు సంబంధించిన హడావుడి ప్రారంభమయ్యింది. అయితే హైదరాబాద్‌లో ఈ వేడుకలు చేసుకోవడం మాత్రం నిజంగా ఒక మంచి అనుభూతిని ఇస్తుందని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఇది మీకు జీవితాంతం గుర్తుండిపోవడం ఖాయం. హైదరాబాద్ నగరం విభిన్న సంస్కృతుల సమ్మేళనం. గొప్ప చారిత్రాత్మక కట్టడాలు కలిగిన నగరం. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుపుకోవడానికి ఇక్కడ చాలా ప్రదేశాలు అనువుగా ఉంటాయి.
వాటిలో మొదటిది
గోల్కొండ కోట లైట్ అండ్ సౌండ్ షో: హైదరాబాద్‌లో గోల్కొండ కోట ఎంత ప్రత్యేకమో చెప్పనక్కర్లేదు. భాగ్యనగరం అనగానే మొదట గుర్తొచ్చేది ఈ పేరే. హైదరాబాద్ గత వైభవానికి ప్రతీక ఈ కట్టడం. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఇక్కడ ఈ కట్టడ చరిత్ర, అదే విధంగా అనేక స్వాతంత్ర్య పోరాట ఘట్టాలను లేజర్ లైట్ల, సౌండ్స్ ద్వారా ప్రదర్శించారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరిగే ఏదైనా మంచి ప్లేస్‌ను చూడాలనుకుంటే ఇది బెస్ట్ ప్లేస్ అని చెప్పవచ్చు.
చౌమహల్లా ప్యాలెస్: భాగ్యనగర రాచరిక చరిత్ర దాగివున్న ప్యాలెస్ చౌమహల్లా ప్యాలెస్. ఇది నిజాంల సంస్థానం. ఇది హైదరాబాద్ రాచరిక వారసత్వానికి అద్దం పడుతుంది. స్వాతంత్ర్య దినోత్సవం నాడు, ఈ ప్యాలెస్‌లో భారతదేశ స్వాతంత్ర్య పోరాటానికి సంబంధించిన ప్రత్యేక కార్యక్రమాలు, ప్రదర్శనలను నిర్వహించే అవకాశం ఉంది. అదేవిధంగా ప్యాలెస్‌కు సంబంధించిన వివరాలు అంటే ప్యాలెస్ వాస్తుకళ, అలాగే దానిలో ఉంటే పచ్చని తోటలు మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు.
ట్యాంక్ బండ్, నెక్లస్ రోడ్: హైదరాబాద్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచే వాటిలో వీటిని ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఇండిపెండెన్స్ థీమ్‌తో ఈ వీధులను డెకరేట్ చేస్తారు. హాయిగా ఆ లైటింగ్స్, డెకరేషన్ చూస్తూ ఆ వీధుల్లో నడిస్తే మంచి అనుభూతి కలుగుతుంది. అంతేకాకుండా హుస్సేన్ సాగర్‌లో సరదాగా బోటు ప్రయాణం కూడా చేయవచ్చు.
Also Read : Hyderabad: ఈసారి మీ వీకెండ్‌ని ఇలా ప్లాన్ చేసుకోండి?
సాలార్ జంగ్ మ్యూజియం: చరిత్ర, కళల పట్ల ఆసక్తి ఉన్నవారికి సాలార్ జంగ్ మ్యూజియం సందర్శన మంచి అనుభూతిని కలిగిస్తుందనే చెప్పవచ్చు. ఈ మ్యూజియంలో వివిధ కాలాలకు చెందిన కళాఖండాలు, పెయింటింగ్‌లు, ఆకట్టుకునే శిల్పాలు ఉన్నాయి. ఇది భారతదేశం విభిన్న సాంస్కృతిక వారసత్వం, స్వాతంత్ర్య పోరాటంతో సహా చరిత్రకు సంబంధించిన అనేక ఘట్టాలకు సంబంధించిన వివరాలను అందిస్తుంది. ఇండిపెండెన్స్ రోజు దీనిని సందర్శించడం మీకు నిజంగా ఒక గొప్ప ఫీలింగ్‌ను ఇస్తుంది.
వీటిలో ఏ ప్రదేశాన్ని స్వాతంత్ర్య దినోత్సవం రోజు సందర్శించినా మీరు మంచి అనుభూతిని పొందటంతో పాటు ఎన్నో విషయాలను తెలుసుకునే అవకాశం ఉంటుంది.