NTV Telugu Site icon

Hyderabad: నాలుగు రాళ్లు వెనకేసుకోమంటే 418 రాళ్లు వేసుకున్నాడు.. షాకైన డాక్టర్లు!

148

148

జీవితంలో నాలుగు రాళ్లు వెనకేసుకోవాలంటారు పెద్దలు. ఒకరి మీద ఆధారపడకుండా ఉండాలంటే అవకాశం ఉన్నప్పుడే డబ్బు పొదుపు చేసుకోవాలని సూచిస్తుంటారు. భవిష్యత్‌లో జీవితంగా సాఫీగా ఉంటుందని పెద్దలు సలహాలు ఇస్తుంటారు. కానీ ఓ వ్యక్తికి ఏమర్థమైందో.. ఏంటో తెలియదు గానీ.. ఏకంగా కడుపులో 418 రాళ్లు వెనకేసుకున్నాడు. ఇదేదో వింతగా అనిపించడంలేదు. మీరు చదువుతున్నది నిజమే. షాకింగ్ న్యూస్‌గా అనిపిస్తుందా? మీరే కాదు.. పరీక్షించిన వైద్యులకే కళ్లు బైర్లు కమ్మాయి. అసలు ఈ రాళ్లేంటో.. ఆ పేషెంట్ కథేంటో తెలియాలంటే ఈ వార్త చదవండి.

హైదరాబాద్‌లో 60 ఏళ్ల వృద్ధుడు కిడ్నీ సమస్యతో ఆస్పత్రిలో చేరాడు. ఆయా పరీక్షలు నిర్వహించిన తర్వాత మూత్రపిండాల్లో భారీగా స్టోన్స్ ఉన్నట్లు గుర్తించారు. దీంతో ఆసియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ (AINU)లో నిపుణులైన వైద్యుల బృందం రంగంలోకి దిగింది. అనంతరం శస్త్ర చికిత్స ద్వారా మొత్తం 418 రాళ్లను విజయవంతంగా తొలగించారు. ప్రస్తుతం రోగి కిడ్నీలు 27 శాతమే పని చేస్తున్నాయని డాక్టర్లు తెలిపారు.

ఇలా శస్త్ర చికిత్స ద్వారా ఇన్ని రాళ్లు తొలగించడం వైద్య విధానంలో ఇదొక గణనీయమైన పురోగతిగా వైద్యులు చెప్పుకొస్తున్నారు. ఒక సూక్ష్మ కెమెరా మరియు లేజర్ ప్రోబ్స్‌, ప్రత్యేక పరికరాలను ఉపయోగించారు.

ఇదిలా ఉంటే ఎలాంటి సర్జికల్ ఓపెనింగ్స్ లేకుండానే ఈ రాళ్లను తొలగించారు. దీంతో గాయం మానడానికి.. అలాగే రోగి కూడా త్వరగా కోలుకోవడానికి అవకాశం ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. దాదాపు రెండు గంటల పాటు శ్రమించి ఈ రాళ్లను తొలగించారు. అధునాతన మైన ఇమేజింగ్ టెక్నాలజీతో పాటు అత్యాధునికి పరికారాలు ఉపయోగించి ఈ శస్త్ర చికిత్సను నిర్వహించారు.

మూత్ర పిండాల్లో రాళ్ల సమస్యతో బాధపడుతున్న రోగులకు ఇదొక ఆశాజ్యోతిగా ఉంటుందని వైద్యులు చెప్పుకొస్తున్నారు. ఈ ఆపరేషన్‌లో డా. కె. పూర్ణ చంద్ర రెడ్డి, డాక్టర్. గోపాల్ ఆర్. డాక్టర్. దినేష్ నేతృత్వంలోని బృందం పాల్గొంది.