Hyderabad Horror: సినిమా షూటింగ్ పేరుతో దారుణం.. యువతిపై ఇద్దరు యువకుల అత్యాచారం!

  • సినిమా షూటింగ్ పేరుతో దారుణం
  • యువతిపై ఇద్దరు యువకుల అత్యాచారం
  • అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్న పోలీసులు
Hyderabad Horror

Hyderabad Horror

హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ ప్రాంతంలో ఓ యువతిపై ఇద్దరు యువకులు లైంగికదాడికి పాల్పడిన ఘటన కలకలం రేపుతోంది. సినిమా షూటింగ్‌లో అవకాశం ఇస్తామని నమ్మించి యువతిని గదికి తీసుకెళ్లి రెండు రోజుల పాటు అత్యాచారం చేయారు. బాధితురాలి ఫిర్యాదుతో జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

పోలీసుల వివరాల ప్రకారం.. జూబ్లీహిల్స్ మెట్రో స్టేషన్ సమీపంలో ఇద్దరు అనాథ యువతులు నివాసం ఉంటున్నారు. వారు చిన్న చిన్న సినిమా షూటింగ్‌లు, ఈవెంట్ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో ఓ యువకుడు బాధిత యువతితో పరిచయం పెంచుకుని.. సినిమా షూటింగ్ ఉందంటూ మాయమాటలు చెప్పి నమ్మించాడు. ఆ తర్వాత యువతిని సికింద్రాబాద్‌లోని ఓ గదికి తీసుకెళ్లిన నిందితుడు.. తన స్నేహితుడితో కలిసి ఆమెపై రెండు రోజుల పాటు లైంగికదాడికి పాల్పడ్డాడు. అనంతరం ఈ నెల 16న ర్యాపిడో బుక్ చేసి యువతిని తిరిగి పంపించారు.

ఇంటికి వచ్చిన యువతి ఒంటిపై గాయాలు ఉండటాన్ని గమనించిన ఆమె స్నేహితురాలు వెంటనే గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించింది. చికిత్స సమయంలో వైద్యులు ఏమి జరిగిందని ప్రశ్నించగా.. తనపై లైంగికదాడి జరిగిన విషయాన్ని బాధితురాలు వెల్లడించింది. దీంతో బాధితురాలి స్నేహితురాలు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు ఆధారంగా ఇద్దరు గుర్తుతెలియని యువకులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు సమాచారం. ఈ ఘటనపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. సినిమా అవకాశాల పేరుతో యువతులను మోసం చేసే వారిపై అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.