Khaja Moizuddin Mur*der: హైకోర్టు న్యాయవాది ఖాజా మొయినుద్దీన్ హత్య కేసులో వెలుగులోకి సంచలన విషయాలు.!

Khaja Moizuddin

Khaja Moizuddin

Khaja Moizuddin Murder Case: హైదరాబాద్‌లో సంచలనం రేపిన హైకోర్టు న్యాయవాది ఖాజా మొయినుద్దీన్ హత్య కేసులో కీలక విషయాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. రెడ్‌హిల్స్‌ శాంతినగర్‌లో ఇటీవల జరిగిన ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ప్రాథమిక విచారణలో ఇది సాధారణ హిట్ అండ్ రన్ కేసు కాదని, పక్కా ప్రణాళికతో చేసిన హత్య అని పోలీసులు నిర్ధారించారు.

భూ వివాదాల్లో ఖాజా మొయినుద్దీన్ అడ్డుగా మారుతున్నాడనే కారణంతో ప్రత్యర్థులు అతన్ని హత్య చేయాలని కుట్ర పన్నినట్లు సమాచారం. ఈ హత్య కోసం ఏడాది కాలంగా సుపారీ ముఠాలతో సంప్రదింపులు జరిపినట్లు పోలీసులు గుర్తించారు. డిసెంబర్ నెలలో కిషన్‌సింగ్ అలియాస్ పప్పుకు సుపారీ ఇచ్చినట్లు అనుమానిస్తున్నారు పోలీసులు. మొదట ఈ హత్యను రోడ్డు ప్రమాదంలా చిత్రీకరించాలని నిందితులు ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. కారుతో ఢీకొట్టి ప్రమాదంలా చూపించాలని భావించిన ముఠా, ఇందుకోసం కారు స్టంట్స్‌లో నిపుణుడైన అభిజిత్‌ను రంగంలోకి దింపింది. హత్యకు ఉపయోగించేందుకు సెకండ్‌ హ్యాండ్ కారు కొనుగోలు చేసి పలుమార్లు రిహార్సల్స్ కూడా చేసినట్లు విచారణలో తేలింది.

హత్యకు మూడు రోజుల ముందు నుంచే న్యాయవాది కదలికలపై నిందితులు నిఘా పెట్టినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ నెల 22న నారాయణగూడలోని ఓ హోటల్‌లో సుపారీ ముఠా సమావేశమై చివరి ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. అనంతరం తెల్లవారుజామున ఖాజా మొయినుద్దీన్ ఇంటి వద్ద కారుతో ఢీకొట్టి హత్య చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. అయితే ఘటనలో ఉపయోగించిన రెండు కార్లకు ఎలాంటి నష్టం జరగకపోవడం పోలీసులను ఆశ్చర్యానికి గురి చేసింది. సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించిన పోలీసులు ఇది సాధారణ హిట్ అండ్ రన్ కాదని స్పష్టంగా తేల్చారు. నెంబర్ ప్లేట్ లేని కారుతో దాడి చేసినట్లు గుర్తించారు.

ఈ కేసులో కిషన్‌సింగ్, వినయ్, నాని, అభిజిత్‌ల పాత్ర ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఇప్పటికే వినయ్‌ను అదుపులోకి తీసుకుని టాస్క్‌ఫోర్స్ అధికారులు విచారిస్తున్నారు. కాగా అభిజిత్, నాని, కిషన్‌సింగ్ ప్రస్తుతం పరారీలో ఉన్నారు. ఈ ముగ్గురిని పట్టుకుంటే అసలు సూత్రధారి ఎవరో బయటపడే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు.