హైదరాబాద్‌లో గ్రీన్ ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరాపై తీవ్ర చర్చ మొదలైంది. గార్డెనింగ్, ల్యాండ్ స్కేపింగ్, నిర్మాణ అవసరాల కోసం శుద్ధి చేసిన మురుగు నీటిని అందించాలనే లక్ష్యంతో జలమండలి ప్రారంభించిన గ్రీన్ ట్యాంకర్ల సేవలపై తాజాగా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఖాజాగూడలోని ఓ నాలా నుంచి ఎలాంటి శుద్ధి ప్రక్రియ లేకుండానే.. మురుగు నీటిని నేరుగా గ్రీన్ ట్యాంకర్లలో నింపుతున్నట్లు ఆరోపణలు రావడం కలకలం రేపుతోంది.
తాగునీటి అవసరాలకు కాకుండా ఇతర పనులకు శుద్ధి చేసిన మురుగు నీటిని వినియోగించాలనే ఉద్దేశంతో జలమండలి ఈ గ్రీన్ ట్యాంకర్ల విధానాన్ని తీసుకొచ్చింది. నవంబర్ 1న ఈ సేవలను అధికారికంగా ప్రారంభించింది. ఎస్టీపీల (మురుగు నీటి శుద్ధి కేంద్రాలు)లో శుద్ధి చేసిన నీటిని ట్యాంకర్ల ద్వారా సరఫరా చేయాల్సి ఉంటుంది. అయితే ఖాజాగూడలో మాత్రం నాలాలోని మురుగు నీటినే నేరుగా ట్యాంకర్లలోకి ఎక్కిస్తున్నారన్న ఆరోపణలు ఇప్పుడు అధికారుల పర్యవేక్షణపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. గ్రీన్ ట్యాంకర్లలో నింపుతున్న నీటిని ఎక్కడి నుంచి సేకరిస్తున్నారు?.. శుద్ధి చేసిన నీటిని అందించాల్సిన వ్యవస్థలోకి మురుగు నీరు ఎలా చేరిందన్నది ఇప్పుడు ప్రధాన ప్రశ్నగా మారింది. ట్యాంకర్లలో నింపే నీటి నాణ్యతను ఎవరు పరీక్షిస్తున్నారు?.. నిరంతరం పర్యవేక్షించే వ్యవస్థ ఉందా? అన్న అంశాలపైనా చర్చ జరుగుతోంది.
శుద్ధి చేయని మురుగు నీటిని గార్డెనింగ్, ల్యాండ్‌స్కేపింగ్, నిర్మాణ పనులకు వినియోగిస్తే ప్రజారోగ్యంతో పాటు పర్యావరణంపై కూడా ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. గ్రీన్ ట్యాంకర్ల పేరుతో నిజంగానే నాలా నీటిని సరఫరా చేస్తుంటే అందుకు బాధ్యులెవరు?.. ఎవరి అనుమతితో ఈ నీటిని ట్యాంకర్లలో నింపుతున్నారు? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ ఆరోపణలపై జలమండలి, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు విచారణ చేపట్టినట్లు సమాచారం. ఖాజాగూడలో ట్యాంకర్లకు నీటిని ఎక్కడి నుంచి నింపుతున్నారు?.. నిజంగా శుద్ధి చేయని మురుగు నీటిని వినియోగిస్తున్నారా?.. అలా చేస్తుంటే ఎవరి అనుమతితో ఈ పని జరుగుతోంది? అనే అంశాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. గ్రీన్ ట్యాంకర్ల సరఫరా విధానంపై సమగ్ర తనిఖీలు నిర్వహించి, నీటి వనరులు, శుద్ధి ప్రక్రియ, నాణ్యత పర్యవేక్షణ వివరాలను స్పష్టం చేయాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి.

