Hyderabad: హైదరాబాద్ నగరంలోని ఫుట్‌బాల్ అభిమానులకు రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త చెప్పింది. క్రీడాభిమానుల నుంచి వచ్చిన విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకున్న సర్కారు.. ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌ను ప్రజలు పెద్ద ఎత్తున ఎంజాయ్ చేసేందుకు వీలుగా ప్రత్యేక సడలింపులు ప్రకటించింది. అర్జెంటీనా–స్పెయిన్ జట్ల మధ్య జరగబోయే ఈ హై-వోల్టేజ్ ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ పోరు సోమవారం తెల్లవారుజామున 12:30 గంటలకు ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఆదివారం సాయంత్రం నుంచి మ్యాచ్ ముగిసే వరకు.. లైవ్ స్క్రీనింగ్ ద్వారా మ్యాచ్‌ను బహిరంగంగా ప్రదర్శించాలనుకునే అన్ని హోటళ్లు, రెస్టారెంట్లు, పబ్‌లు, క్రీడా కేంద్రాలు, ఫుడ్ అండ్ బేవరేజ్ సంస్థలకు అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా తమ కార్యకలాపాలు నిర్వహించుకునేందుకు ప్రభుత్వం ప్రత్యేక అనుమతులు ఇచ్చింది.
అయితే ఈ అర్ధరాత్రి సడలింపులతో పాటు భద్రత విషయంలో మాత్రం ప్రభుత్వం చాలా కఠినంగా వ్యవహరించనుంది. నూతన సంవత్సర వేడుకల తరహాలోనే ఇక్కడ కూడా కఠినమైన నిబంధనలు అమలు చేయనున్నట్లు స్పష్టం చేసింది. ముఖ్యంగా మ్యాచ్ జోష్‌లో మద్యం సేవించి వాహనాలు నడిపే డ్రంక్ అండ్ డ్రైవ్ బాబులపై పోలీసులు ఎలాంటి రాజీ లేకుండా చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటారని హెచ్చరించింది. అభిమానులు బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ మ్యాచ్‌ను ఆస్వాదించాలని పోలీసులు సూచించారు.

