హైదరాబాద్‌లో మహిళలను లక్ష్యంగా చేసుకుని సాగుతున్న అక్రమ అండాల విక్రయాల హ్యూమన్ ట్రాఫికింగ్ నెట్‌వర్క్‌ను మల్కాజిగిరి పోలీసులు ఛేదించారని సీపీ సుమతి వెల్లడించారు. నిందితులు ఒక ముఠాగా ఏర్పడి అండాల సేకరణ, అమ్మకాల దందాను నడుపుతున్నట్లు గుర్తించారు. వెస్ట్ బెంగాల్, మహారాష్ట్రతో పాటు వివిధ గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన అమాయక యువతులను ట్రాప్ చేసి, హైదరాబాద్‌లోని ప్రకాష్ నగర్, సరూర్‌నగర్, గోపాల్పురం ప్రాంతాల్లోని మూడు వేర్వేరు వసతి గృహాల్లో అద్దెకు ఉంచారు. ఒక్కో సారి అండ విసర్జన ద్వారా ముఠా రూ. 3 లక్షలు ఆర్జిస్తుండగా, బాధిత మహిళలకు మాత్రం రూ. 30 వేలు, వలంటీర్ ఇన్సెంటివ్స్ ఇస్తామని నమ్మించి మోసం చేశారు.
ఈ క్రమంలో బాధిత మహిళలకు పదేపదే హార్మోనల్ ఇంజెక్షన్లు ఇస్తూ వారి ఆరోగ్యంతో చెలగాటమాడారు. నాంపల్లికి చెందిన దుర్గాప్రసాద్, ఈ దందాలో ప్రధాన సూత్రధారి అయిన ఇండోర్ వాసి అమిత్ శర్మతో చేతులు కలిపి సరూర్‌నగర్ పరిధిలో కార్యకలాపాలు సాగించాడు. వెస్ట్ బెంగాల్‌కు చెందిన నిక్కత్ పర్వీన్, రేష్మా అనే సబ్ ఏజెంట్‌తో కలిసి నకిలీ పత్రాలు సృష్టించి ఈ మాఫియాను నడిపించారు. సికింద్రాబాద్‌కు చెందిన షేక్ పర్వీన్ ఉమెన్ ఏజెంట్‌గా బాధిత మహిళలను రవాణా చేయగా, పంకజ్ సోనీ క్యాటరింగ్ బాధ్యతలు చూసుకున్నాడు. ఏఆర్టీ (ART) కో-ఆర్డినేటర్‌గా ఉన్న మేఘవత్ అలియాస్ సోనూతో పాటు ఆర్విఎస్ లైసెన్స్ కలిగిన విజయ్ భగవత్ రావు అనే వ్యక్తి నకిలీ డాక్యుమెంట్లు తయారు చేస్తూ ఫెర్టిలిటీ సెంటర్లతో క్రమం తప్పకుండా సంబంధాలు నెరిపాడు.
ఈ నెట్‌వర్క్‌పై బేగంపేట, సరూర్‌నగర్ లలో మూడు రిక్రూట్మెంట్ ఏరియాలపై రైడ్లు చేసి మొత్తం మూడు కేసులు నమోదు చేశారు. ఈ దాడుల్లో బేగంపేట్ నుంచి 31 మంది, సరూర్‌నగర్ నుంచి 18 మంది చొప్పున మొత్తం 49 మంది బాధిత మహిళలను గుర్తించి రక్షించారు. అమిత్ శర్మ, నిక్కత్ పర్వీన్, రేష్మ, మేకావత్ శ్రీనివాస్, ప్రదీప్, పర్వీన్, విజయ్ భగవాన్, పంకజ్ సోనీలతో పాటు దుర్గాప్రసాద్‌ను కలిపి మొత్తం ఎనిమిది మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ముఠాతో సంబంధాలున్న పలు ఫెర్టిలిటీ సెంటర్లలో త్వరలోనే తనిఖీలు చేపట్టి, రికార్డులను సరిచూసి, హార్మోనల్ ఇంజెక్షన్లు. ఫేక్ డాక్యుమెంట్లు లభిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ హెచ్చరించారు.

