Here is Reasons Why Tilak Varma Picked In India World Cup 2023 Squad: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ద్వారా భారత జట్టులోకి చాలా మంచి ప్లేయర్స్ వచ్చారు. రవీంద్ర జడేజా, ఆర్ అశ్విన్, జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా, రిషబ్ పంత్, మొహ్మద్ సిరాజ్, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, శుభమాన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్.. ఈ జాబితా పెద్దగానే ఉంది. తాజాగా హైదరాబాద్ ఆటగాడు తిలక్ వర్మ కూడా ఈ జాబితాలో చేరాడు. ఐపీఎల్‌లో గత రెండు సీజన్లుగా నిలకడగా రాణించిన లెఫ్టాండర్ తిలక్.. తాజాగా వెస్టిండీస్‌తో జరిగిన తొలి టీ20 మ్యాచ్ ద్వారా భారత జట్టులోకి వచ్చాడు.
తొలి టీ20 మ్యాచ్‌లో 22 బంతులు ఎదుర్కొన్న హైదెరాబాదీ ఆటగాడు తిలక్ వర్మ.. 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో 39 పరుగులు చేశాడు. భారత ఇన్నింగ్స్‌లో తిలక్‌దే అత్యధిక స్కోర్ కావడం విశేషం. రెండో టీ20లో అద్భుతంగా ఆడి హాఫ్ సెంచరీ (51) చేశాడు. ఇక మూడో టీ20లో 49 పరుగులతో అజేయంగా నిలిచాడు. మూడు మ్యాచ్‌ల్లోనూ ప్రతికూల పరిస్థితుల్లో అతడి బ్యాటింగ్ అందరిని ఆకట్టుకుంది. దాంతో 20 ఏళ్ల ఈ యువ బ్యాటర్‌పై ఫాన్స్ సహా మాజీ క్రికెటర్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. టీమిండియాకు మూడు ఫార్మాట్లలో సుదీర్ఘకాలం ఆడగల సత్తా ఉందన్నారు. ప్రపంచకప్ 2023 రేసులో కూడా తిలక్ వర్మ ఉన్నాడని సోషల్ మీడియాలో చర్చ మొదలైంది.
పరిస్థితులకు తగ్గట్లు ఆడడం:
తిలక్ వర్మ ప్రపంచకప్ 2023లో ఆడే అవకాశాలను కొట్టిపారేయలేం. అతడికి కలిసొచ్చే అంశాలు ప్రస్తుతం చాలానే ఉన్నాయి. తిలక్ వర్మ సామర్థ్యమేంటో ఐపీఎల్‌నే అందరూ చూశారు. టీ20లు కదా అని అడ్డదిడ్డంగా షాట్లు ఆడి పరుగులు చేయకుండా.. మంచి టెక్నిక్‌తో రన్స్ రాబడుతున్నాడు. ఎలాంటి స్థితిలో అయినా షాట్లు ఆడగల సామర్థ్యం అతడి సొంతం. పరిస్థితులకు తగ్గట్లు ఆడుతున్నాడు. అవసరం అయినప్పుడు ఓపికతో క్రీజులో ఉంటున్నాడు, లేదంటే భారీ షాట్లు కూడా ఆడుతున్నాడు. ఒత్తిడి అధికంగా ఉండే మిడిలార్డర్లోనే బాగా రాణిస్తున్నాడు. మ్యాచ్‌లను సైతం ముగిస్తున్నాడు.
లెఫ్టాండర్ బ్యాటర్:
లెఫ్టాండర్ బ్యాటర్ కావడం తిలక్ వర్మకు బాగా కలిసొచ్చే అంశం. ప్రస్తుతం భారత జట్టులో లెఫ్ట్‌హ్యాండర్లు బాగా తగ్గిపోయారు. ఒకప్పుడు 2-3 ఉంటుండగా.. ఇప్పుడు ఒక్కడే ఉంటున్నాడు. రిషబ్ పంత్ లెఫ్టాండర్ అయినా గాయం కారణంగా అతడు ప్రపంచకప్‌లో ఆడడు. ఇక ఇషాన్ కిషన్ మినహాయిస్తే బ్యాటర్లలో ఎడమ చేతి వాటం ఆటగాళ్లు ఎవరూ లేరు. లెఫ్టాండర్‌గా ఇప్పుడు తిలక్ రాణించడం కలిసొచ్చే విషయం.
Also Read: Rajinikanth’s Jailer: రజినీతో అట్లుంటది మరి.. ఉద్యోగుల కోసం 7 స్క్రీన్స్ బుక్ చేసిన సీఈఓ!
కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ గాయాలు:
వన్డే ప్లేయర్స్ కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ గాయాల నుంచి కోలుకుంటున్నారు. వారు ఫిట్‌నెస్ సాధిస్తేనే మెగా టోర్నీలో ఆడుతారు. కొన్ని నెలల పాటు గాయాలతో మైదానానికి దూరంగా ఉన్న వారిని ప్రపంచకప్‌కు ఎంపిక చేస్తారా? లేదా? అన్న అనుమానాలు లేకపోలేదు.
నాలుగో నంబర్:
నాలుగో స్థానంలో కుదురుకున్న శ్రేయస్ అయ్యర్ గాయపడడంతో.. సూర్యకుమార్ యాదవ్, సంజూశాంసన్, ఇషాన్ కిషన్ అంటూ జట్టు యాజమాన్యం చాలా ప్రయోగాలు చేసింది. అవన్నీ బెడిసి కొట్టాయి. ప్రస్తుతం నాలుగో స్థానంలో ఆడే ప్లేయర్ లేడు. ఈ పరిస్థితుల్లో తిలక్ వర్మ నిలకడను కొనసాగిస్తే ప్రపంచకప్‌కు కచ్చితంగా రేసులో ఉంటాడు. ప్రస్తుత టీ20 ప్రదర్శన ఆధారంగా వన్డే ఫార్మాట్లో జరిగే ఆసియా కప్‌కు ఎంపిక చేస్తే.. అందులోనూ సత్తా చాటితే ప్రపంచకప్ ఆడతాడు.