Site icon NTV Telugu

Crime News: కారుకు చిన్న డ్యాష్ ఇచ్చిన పాపానికి.. యువకుడిని చితక్కొట్టిన గ్యాంగ్‌!

Bike Car Clash

Bike Car Clash

బైక్‌తో కారును చిన్న డ్యాష్‌ ఇచ్చిన పాపానికి.. యువకుడిని చితక్కొట్టింది ఓ గ్యాంగ్‌! పోనీ యువకుడిదే తప్పా అంటే.. అదీ కాదు. కారులోని వ్యక్తి దిగి యువకుడిని కొడుతుండగానే.. అక్కడే ఉన్న స్థానికులు కూడా మా అన్న కారుకే డ్యాష్‌ ఇస్తావా అంటూ క్రికెట్‌ బ్యాట్‌లతో చావబాదారు. బండ్లగూడ మెయిన్‌ రోడ్డులో ట్రాఫిక్‌ జామ్‌ అవుతున్నా ఊరుకోలేదు.. వాహనదారులు అడ్డుకునే ప్రయత్నం చేసినా.. ఆ గ్యాంగ్‌ యువకుడిపై మూకుమ్మడి దాడి చేశారు. అటుగా వెళ్తున్న వాహనదారులు తీసిన వీడియోలు వైరల్‌ కావడంతో పోలీసులు ఆ గ్యాంగ్‌ను పట్టుకుని కేసు నమోదు చేశారు.

బండ్లగూడ ప్రధాన రహదారిపై ఈనెల 23న చోటుచేసుకున్న ఘటన. ఓ యువకుడిని ఓ గ్యాంగ్‌ చితక్కొడుతున్నారు. బైక్‌పై నుంచి కిందపడి.. నిస్సహాయ స్థితిలో పడి ఉన్న..యువకుడిని ఒంటరి చేసి ఆ గ్యాంగ్‌ చావబాదారు. ఓ వైపు నుంచి కొందరు పిడిగుద్దులు గుద్దుతుంటే.. మరొకరు క్రికెట్‌ బ్యాట్‌తో కొడుతున్నారు. అంత పెద్ద క్రైమ్‌ ఆ యువకుడు ఏం చేశాడు అనుకుంటున్నారా..?

అసలు ఆ యువకుడి తప్పే లేదు…!! జహంగీరాబాద్‌కి చెందిన సయ్యద్‌ యూసుఫ్‌, ఆబిద్‌ అనే యువకులు చంద్రాయణగుట్ట పరిధిలో వెల్డింగ్‌ వర్క్‌ చేస్తుంటారు. వెల్డింగ్‌ మెషీన్‌కి రిపేర్ రావడంతో.. బాగు చేయించుకునేందుకు బైకుపై ఆబిద్‌, యూసుఫ్‌ అరాంఘర్‌ వైపు వెళ్తున్నారు. బండ్లగూడ సమీపంలో యూ టర్న్‌ తీసుకుంటుండగా.. అటుగా వస్తున్న ఓ ఫార్చూనర్‌ కారుకు బైక్‌ తగిలింది. కారుకు పెద్దగా డ్యామేజ్‌ కూడా కాలేదు. తాకీ తాకనట్టు చిన్నగా తగిలింది అంతే !! కారులో ఉన్న అబ్దుల్‌ జాకీ.. ఒక్కసారిగా కిందకు దిగి బైకుపై ఉన్న యువకుడు ఆబిద్‌పై మెరుపు దాడి చేశాడు. యువకుల తప్పు లేకపోయినా కొడుతూనే ఉన్నాడు. మేరా కార్‌ కా సామ్నే బ్రేక్‌ మార్‌తా…అంటూ దాడి చేశాడు.

సమీపంలోనే ఉన్న కొందరు యువకులు అబ్దుల్‌ జాకీని గుర్తించారు. మన జాకీ బాయ్‌ ఎవరితోనే గొడవ పడుతున్నాడు అంటూ కారు వద్దకు వెళ్లారు. తప్పు ఎవరిదో కూడా తెలుసుకోకుండా.. అబిద్‌, యూసుఫ్‌లపై క్రికెట్‌ బ్యాట్‌లతో దాడి చేశారు. ఆబిద్‌ తీవ్ర గాయాలతో రోడ్డుపై అచేతనంగా పడి ఉన్నా.. కనికరించకుండా కొట్టారు. అటుగా వస్తున్న వాహనదారులు అడ్డుకునే ప్రయత్నం చేసినా ఆ గ్యాంగ్‌ దాడి చేస్తూనే ఉంది. కొందరు వాహనదారులు ఈ దాడినంతా మొబైల్‌ ఫోన్‌లతో రికార్డ్‌ చేసి సోషల్‌ మీడియాలో అప్‌లోడ్‌ చేశారు.

వైరల్‌ ఐన వీడియోల ఆధారంగా పోలీసులు.. కారు నెంబర్‌ ఆధారంగా జాకీని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. జాకీతో పాటుగా దాడి చేసిన యువకులందరినీ అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి రిమాండుకు తరలించారు. ఓ మాటతో పోయే విషయానికి దాడి చేసే వరకు తెచ్చుకున్నారు యువకులు. హీరోయిజం ప్రదర్శిస్తూ.. స్ట్రీట్‌ రౌడీలుగా దాడి చేయడాన్ని గొప్పగా భావించారు. ఆఖరుకు కేసు బుక్కై కటకటాల పాలయ్యారు.

Exit mobile version