Hyderabad: ఏఎంబీ ఫ్లైఓవర్‌పై ఘోర ప్రమాదం.. ఇద్దరి ప్రాణాలు తీసిన రాంగ్ రూట్ ప్రయాణం..

Amb

Amb

Hyderabad: హైదరాబాద్‌లోని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఏఎంబీ (AMB) ఫ్లైఓవర్‌పై ఈ రోజు ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. రాంగ్ రూట్ ప్రయాణం వల్ల జరిగిన ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. పోలీసుల వివరాల ప్రకారం.. ఉదయం వేళ గచ్చిబౌలి నుంచి హఫీజ్‌పేట్ వైపు ఒక రాయల్ ఎన్‌ఫీల్డ్ (బుల్లెట్) బైక్ వెళ్తోంది. అదే సమయంలో హఫీజ్‌పేట్ నుంచి గచ్చిబౌలి వైపునకు ఒక స్కూటీ ఫ్లైఓవర్‌పై నిబంధనలకు విరుద్ధంగా, రాంగ్ రూట్‌లో వేగంగా దూసుకొచ్చింది. ఫ్లైఓవర్‌పై వాహనాలు వేగంగా ప్రయాణిస్తుండటంతో, ఊహించని విధంగా ఎదురైన స్కూటీని బుల్లెట్ బైక్ చాలా బలంగా ఢీకొట్టింది.

ఈ తీవ్రమైన ప్రమాదంలో స్కూటీపై ప్రయాణిస్తున్న శ్రీకాంత్‌తో పాటు అతని వెనుక కూర్చున్న విఠల్ అనే వ్యక్తి రోడ్డుపై పడిపోయారు. తల, ఇతర భాగాలకు తీవ్రమైన గాయాలు కావడంతో వారిద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. ఇక రాయల్ ఎన్‌ఫీల్డ్ నడుపుతున్న వినోద్ అనే యువకుడికి అదృష్టవశాత్తూ స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘోర ప్రమాదంపై సమాచారం అందుకున్న గచ్చిబౌలి పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాలను పరిశీలించారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.