NTV Telugu Site icon

Off The Record : బీఆర్‌ఎస్‌ని పార్టీ ద్వితీయ శ్రేణే దెబ్బ కొట్టిందా?

Brs

Brs

పార్టీలో లేరు…. పార్టీతో సంబంధం లేదు. కానీ… అధిష్టానం పిలుపునిచ్చిందంటూ…. సడన్‌గా ఓ గ్రూప్‌ గులాబీ కండువాలు మెడలో మెడలో వేసుకుని వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేసింది. గులాబీ పార్టీకి జై కొట్టింది. అది చూసి… పార్టీ కేడరే నోరెళ్ళబెట్టాల్సి వచ్చిందట. ఇంతకీ ఎక్కడ జరిగిందా విచిత్ర ఘటన? ఎందుకలా కొత్త గ్రూప్‌ రోడ్డు మీదికి వచ్చి ఆందోళ చేసింది? సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గం. 2014లో కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన పట్లోళ్ల కిష్టారెడ్డి ఆకస్మిక మరణం తర్వాత 2016లో ఉప ఎన్నిక వచ్చింది. ఆ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి భూపాల్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు. దీంతో మొదటిసారి నారాయణఖేడ్‌లో బీఆర్ఎస్ జెండా ఎగిరింది. ఆ తర్వాత 2018 అసెంబ్లీ ఎన్నికల్లోనూ రెండోసారి గులాబీ పార్టీ విజయం సాధించింది. అప్పుడు బీఆర్ఎస్ అధికారంలో ఉండటం ఎమ్మెల్యే కూడా అదే పార్టీ కావడంతో ఖేడ్ అభివృద్ది బాగానే జరిగిందన్నది లోకల్‌ వాయిస్‌. అయితే 2023 అసెంబ్లీ ఎన్నికలకి వచ్చేసరికి ఎమ్మెల్యేపై స్థానికంగా వ్యతిరేకత పెరిగింది. సొంత పార్టీ నేతలు, కార్యకర్తల నుంచే అసమ్మతి పెరగడంతో అధిష్టానం నష్టనివారణ చర్యలు చేపట్టింది. అయినా అవేమీ వర్కౌట్‌ కాలేదు. కాంగ్రెస్ పార్టీ నుంచి దివంగత ఎమ్మెల్యే కిష్టారెడ్డి కుమారుడు సంజీవరెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే బీఆర్ఎస్ ఓటమికి ప్రధాన కారణం పార్టీ ద్వితీయ శ్రేణి నాయకులను పట్టించకోవడమేనని అప్పట్లో ప్రచారం జరిగింది. మాజీ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి మీద కోపంతో… పలువులు స్థానిక ప్రజాప్రతినిధులు ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. మరికొంతమంది పార్టీనే నమ్ముకుని సైలెంట్ గా ఉండిపోయారు. అయితే… భూపాల్‌రెడ్డిపై బీఆర్‌ఎస్‌లో ఇన్నాళ్ళు అంతర్గతంగా ఉన్న అసంతృప్తి ఇప్పుడు ఒక్కసారిగా బయట పడటంపై చర్చ జరుగుతోంది పార్టీ వర్గాల్లో.

రైతు భరోసాపై రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో నిరసనలకు పిలుపునిచ్చింది బీఆర్ఎస్‌. ఆ క్రమంలో నారాయణఖేడ్‌లో కూడా ఆందోళన జరిగింది. కానీ… స్థానిక నాయకులు ఎవరికి వారుగా దుకాణాలు తెరిచారు. రెండు వర్గాలుగా విడిపోయి ఎవరి ఆందోళన వారు చేయడం ఇప్పుడు టాక్‌ ఆఫ్‌ది ఖేడ్‌ అయింది. మాజీ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి వర్గం ధర్నా చేసి వెళ్లిపోయాక.. మరో వర్గం బీఆర్ఎస్ కండువాలు వేసుకుని ధర్నా చేయడం చూసి అక్కడున్న వాళ్ళంతా షాకయ్యారట. ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా ఉన్న వాళ్లు, తాజా మాజీ ప్రజా ప్రతినిధులు మరో వర్గంగా ఏర్పడి ఈ ధర్నా చేశారట. ఈ ధర్నాకి పార్టీతో సంబంధం లేని మచ్చేందర్ అనే ఓ నాయకుడు చేయించారన్న ప్రచారం జరుగుతోంది. భూపాల్ రెడ్డి పక్కకు పెట్టిన వారితో గ్రూప్‌ ఏర్పాటు చేసుకుని తాను కూడా బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్టు ప్రచారం చేసుకుంటున్నారట మచ్చేందర్. దీనిపై మాజీ ఎమ్మెల్యే వర్గంమాత్రం పార్టీలో ఫేడౌట్‌ అయిన వాళ్లు, జనాదరణ లేని కొందరు ఇలా చెడగొట్టే ప్రయత్నం చేస్తున్నారని, ఈ విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్తామని చెబుతోందట. మొత్తంగా ఇలా…నారాయణ్‌ఖేడ్‌ బీఆర్‌ఎస్‌ ఒక్కసారిగా బీఆర్ఎస్ రెండు వర్గాలుగా విడిపోవడం, అదికూడా పార్టీలో లేని వ్యక్తి గ్రూప్‌పెట్టి…. బీఆర్‌ఎస్‌ కండువాలతో ఆందోళన చేయించడం ఏంటో అర్ధంగాక కిందామీదా అవుతున్నారట కార్యకర్తలు. బీఆర్ఎస్ అగ్రనేతలు వెంటనే జోక్యం చేసుకుని…. వర్గపోరుకి ఫుల్ స్టాప్ పెట్టకుంటే…మొదటికే మోసం వస్తుందని అంటున్నారు. గోటితో పోయేదాన్ని గొడ్డలిదాకా తెచ్చుకుంటే మాత్రం పార్టీ పరిస్థితి అగమ్యగోచరంగా మారే ప్రమాదం ఉందన్నది కేడర్‌ మాట. గులాబీఅధిష్టానం ఈ సమస్యకి ఎలా ఫుల్ స్టాప్ పెడుతుందో చూడాలి మరి.