Telangana Assembly: తెలంగాణ శాసన సభ, శాసన మండలి సమావేశాలు ఈ రోజు ( డిసెంబర్ 29న) ఉదయం 10.30 గంటలకు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాల్లో మొదట దివంగత మాజీ ఎమ్మెల్యేలు రాంరెడ్డి దామోదర్‌రెడ్డి, కొండా లక్ష్మారెడ్డి, మాగంటి గోపినాథ్ లకు సంతాప తీర్మానాలు సహా కొన్ని బిల్లులకు సంబంధించిన పత్రాలను సభలో ప్రవేశ పెట్టే అవకాశం ఉంది. అలాగే, జీహెచ్ఎంసీలో ఓఆర్ఆర్ పరిధిలోని మున్సిపాలిటీల విలీనంతో పాటు జీహెచ్ఎంసీ పరిధి పెరిగడంతో వార్డుల సంఖ్య పెంపు, లోకల్ బాడీ ఎన్నికల్లో ఇద్దరు పిల్లల నిబంధన తొలగింపు, తెలంగాణ జీఎస్టీ సవరణ, ఉద్యోగుల హేతుబద్ధీకరణ, వేతన నిర్మాణ సవరణకు సంబంధించిన రెండు ఆర్డినెన్సులు, గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ చట్ట సవరణ, పంచాయతీరాజ్ కి సంబంధించి గెజిట్ ప్రచురణలను ఈ అసెంబ్లీ సమావేశాల్లో చట్టబద్ధత కల్పించే ఛాన్స్ ఉంది.
Read Also: TG Assembly: కాంగ్రెస్ ఇరుకునపెట్టే బీఆర్ఎస్ వ్యూహాలేంటి?
ఇక, టీఎస్ఎస్ ఆడిట్ రిపోర్ట్, తెలంగాణ పీఎం స్కూల్ ఫర్ రైజింగ్ ఇండియా ఆడిట్ రిపోర్ట్, ఉద్యాన అభివృద్ధి సంస్థ వార్షిక లెక్కలు, తదితర పత్రాలను శాసన సభలో ప్రవేశ పెట్టనున్నారు. తొలిరోజు సమావేశాలు ముగిసిన తర్వాత.. ఉభయ సభలు జనవరి 2వ తేదీకి వాయిదా పడే అవకాశం ఉంది. 30న వైకుంఠ ఏకాదశి, 31న ఆంగ్ల సంవత్సరం చివరి రోజు.. జనవరి 1ని పురస్కరించుకొని సమావేశాలు నిర్వహించడం లేదని సమాచారం. ఇవాళ ఉభయ సభల వాయిదా తర్వాత.. బిజినెస్ అడ్వైజరీ కమిటీ ( బీఏసీ) సమావేశాలు నిర్వహించనున్నారు. ఎన్ని రోజుల పాటు సభలు నిర్వహించాలి అనేది నిర్ణయించనున్నారు.
Read Also: Anil Ravipudi: ‘పటాస్’ హీరోగా డైరెక్టర్ అనిల్ రావిపూడి ఫస్ట్ ఛాయిస్ ఈ హీరోనే..
అయితే, ఈ అసెంబ్లీ సమావేశాల్లో కృష్ణా, గోదావరి నదీ జలాలపై ప్రధానంగా చర్చ జరిగే అవకాశం క్లియర్ గా కనిపిస్తుంది. ప్రధానంగా కృష్ణా నదీ జలాలు, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి కేటాయింపులపై లోతైన చర్చ జరిగే ఛాన్స్ ఉంది. ఈ పథకం డీపీఆర్‌ను కేంద్ర ప్రభుత్వం వెనక్కి పంపించడం.. బీఆర్ఎస్ హయాంలోనే జరిగిందని కాంగ్రెస్ సర్కార్ ఆరోపిస్తుంది. కారు పార్టీ మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే వెనక్కి వచ్చిందని ఆరోపిస్తోంది. ఈ అంశంపై ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి.. గూలాబీ బాస్ కేసీఆర్ మధ్య మాటల యుద్ధం జరిగింది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు 45 టీఎంసీల కేటాయింపులు మాత్రమే సర్కార్ కోరిందని, ఇది తెలంగాణకు నష్టం చేకూర్చుతుందన్నారు. ఈ అంశాలపై అసెంబ్లీ సమావేశాల్లో వాడీ వేడి చర్చలు జరిగే ఛాన్స్ ఉంది.