Homemade Peanut Oil: మెషిన్ అవసరం లేదు.. ఇంట్లోనే పల్లీలతో 100% స్వచ్ఛమైన వేరుశెనగ నూనెను తీయండిలా..

Oil

Oil

Homemade Peanut Oil: మరికొన్ని రోజుల్లో నవరాత్రులు ప్రారంభం కానున్నాయి. ఈ తొమ్మిది రోజుల పాటు ఇంట్లో అమ్మవారికి ప్రత్యేక పూజలు జరపడంతో పాటు చాలామంది ఉపవాసాలు ఉంటారు. ఉపవాస సమయంలో కేవలం సాత్విక ఆహారాన్నే తీసుకుంటూ ధాన్యాలకు దూరంగా ఉంటారు. అందుకని ఫలహారాల తయారీకి ప్రత్యేకమైన నూనెలను ఉపయోగిస్తుంటారు. అందులో పల్లీ నూనె (వేరుశనగ నూనె) ఒకటి. కుట్టు పిండి పూరీలు, రాజగిరా పరోటాలు, ఇతర ఫలహారాలను వేయించడానికి నూనె తప్పనిసరి. మరి మార్కెట్లో దొరికే నూనెల కల్తీ గురించి భయపడుతుంటే.. ఈసారి నవరాత్రుల కోసం ఇంట్లోనే స్వచ్ఛమైన పల్లీ నూనెను సులభంగా తయారు చేసుకోవచ్చు. దీని కోసం ఎలాంటి ఆయిల్ మిషన్ గానీ, ఆయిల్ ప్రెస్ గానీ అవసరం లేదు. ఓ మాస్టర్‌షెఫ్ ఇంట్లోనే వేరుశనగ గింజల నుంచి నూనె తీసే ఒక సులువైన పద్ధతిని పంచుకున్నారు. ఈ పద్ధతి వల్ల కేవలం నూనె మాత్రమే కాదు.. నూనె తీసిన తర్వాత మిగిలిపోయే పల్లీ పిండి (ఖలీ) కూడా వేస్ట్ కాకుండా దాంతో ప్రోటీన్ తో కూడిన పరోటాలు లేదా రుచికరమైన లడ్డూలు చేసుకోవచ్చు. మెషిన్ లేకుండా ఇంట్లోనే నూనె ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం.

కావలసిన పదార్థాలు..

మంచి క్వాలిటీ ఉన్న పచ్చి వేరుశనగ గుళ్ళు (పల్లీలు)
మిక్సీ
కొన్ని గోరువెచ్చని నీళ్లు
ఒక శుభ్రమైన కాటన్ లేదా మస్లిన్ గుడ్డ

తాజా వేరుశనగ గింజలను ఎంచుకోవడం చాలా ముఖ్యం..
ఇంట్లో పల్లీ నూనె తయారు చేయడానికి వేరుశనగ గింజల క్వాలిటీ అత్యంత ప్రధానం. షెఫ్ తెలిపిన వివరాల ప్రకారం.. లేత గులాబీ రంగు పొట్టు ఉండి, గింజలు గట్టిగా ఉన్న పల్లీలను ఎంచుకోవాలి. చేతితో రుద్దితే పొట్టు అంత సులభంగా ఊడిపోకూడదు. పొట్టు లూజుగా ఉన్నా లేదా నూనె వాసన, తేమ వాసన వస్తున్నా అలాంటి పల్లీలను వాడకూడదు. నాణ్యత లేని పల్లీల వల్ల నూనె చేదుగా మారే ప్రమాదం ఉంది.

పల్లీ నూనె తయారు చేసే విధానం..

ముందుగా అర కిలో పచ్చి వేరుశనగ గింజలను తీసుకోండి. వీటిని పొట్టు తీసి, మందపాటి బాణలిలో వేసి చిన్న నుంచి మీడియం మంటపై 8 నుంచి 12 నిమిషాల పాటు కలుపుతూ వేయించాలి. పల్లీ పొట్టు దోరగా మారి, తేలికగా ఊడిపోయే స్థితికి రాగానే స్టవ్ ఆఫ్ చేయాలి. పల్లీలు మరీ మాడిపోకుండా చూసుకోవాలి, లేదంటే నూనె మాడిన వాసన వస్తుంది. అలాగని సరిగ్గా వేగకపోతే పచ్చి వాసన ఉండిపోతుంది. వేయించిన పల్లీలను చల్లారనిచ్చి, ఒక కాటన్ గుడ్డలో వేసి చేతులతో తేలికగా రుద్దితే పొట్టు అంతా సులభంగా ఊడిపోతుంది. పొట్టు వేరు చేసిన పల్లీలను మిక్సీ జార్‌లో వేయాలి. మిక్సీని వరుసగా తిప్పకుండా పల్స్ మోడ్‌లో (30 సెకన్ల విరామంతో) తిప్పుతూ గ్రైండ్ చేయాలి. దీనివల్ల మిశ్రమం వేడెక్కకుండా ఉంటుంది.గ్రైండ్ చేస్తున్న కొద్దీ పల్లీల మిశ్రమం పేస్ట్ లా తయారై, కాస్త మెరుపు వస్తుంది. అంటే పల్లీల నుంచి నూనె విడుదలవ్వడం ప్రారంభమైందని అర్థం. ఈ పల్లీ పేస్ట్‌ను ఒక వెడల్పాటి పళ్లెంలోకి తీసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒకటొకటిగా టేబుల్ స్పూన్ల కొద్దీ గోరువెచ్చని నీళ్లు పోస్తూ చపాతీ పిండిలా చేతులతో బాగా ఒత్తుతూ కలపాలి. నీళ్లను ఒకేసారి ఎక్కువగా పోయకూడదు. సుమారు 3 నుంచి 4 స్పూన్ల గోరువెచ్చని నీళ్లు వేసి బాగా పిసకాలి.

చేతులతో బాగా ఒత్తి కలిపే కొద్దీ పల్లీల నుంచి నూనె వేరుపడి బయటకు రావడం కనిపిస్తుంది. దాదాపు 7 నుంచి 8 నిమిషాల పాటు బాగా ఒత్తిన తర్వాత మంచి మొత్తంలో నూనె బయటకు వస్తుంది. ఆ నూనెను వడకట్టి ఒక శుభ్రమైన పాత్రలోకి తీసి పెట్టుకోవాలి. నూనె తీసిన తర్వాత మిగిలిన పల్లీ ముద్దను ఒక పల్చటి కాటన్/మస్లిన్ గుడ్డలో వేసి బాగా పిండాలి. నూనె బొట్లు రావడం ఆగిపోయే వరకు బాగా ఒత్తి పిండాలి. వచ్చిన నూనెను ఒక గాజు సీసాలో పోసి నిల్వ చేసుకోవాలి. ప్రారంభంలో నూనె కొద్దిగా మబ్బుగా (ధుంధ్లాగా) అనిపించవచ్చు, దానికి కంగారుపడాల్సిన పనిలేదు. సీసాను కదల్చకుండా 2 నుంచి 3 గంటల పాటు పక్కన పెడితే అడుగున ఉన్న చిన్న కణాలు కిందకు చేరుకుంటాయి. ఆ తర్వాత పైన తేలిన నూనెను మళ్లీ గుడ్డతో వడకట్టుకుంటే స్వచ్ఛమైన నూనె సిద్ధమవుతుంది. ఈ నూనెను తేమ లేని చల్లని ప్రదేశంలో నిల్వ చేసుకోవచ్చు.

మిగిలిన పిండితో ప్రోటీన్ లడ్డూలు లేదా పరోటాలు..

పల్లీల నుంచి నూనె తీసిన తర్వాత మిగిలిన ముద్దలో (పిండి) పుష్కలంగా ప్రోటీన్ ఉంటుంది. దీన్ని పారేయకుండా గోధుమ పిండిలో కలిపి ప్రోటీన్ పరోటాలు తయారు చేసుకోవచ్చు. లేదా ఇందులో కాస్త బెల్లం పొడి, వేయించిన నువ్వులు కలిపి ఆరోగ్యకరమైన, రుచికరమైన లడ్డూలు చుట్టుకోవచ్చు. దీనివల్ల పదార్థం ఏదీ వేస్ట్ కాకుండా నూనెతో పాటు మంచి స్నాక్ కూడా ఇంట్లోనే తయారవుతుంది.

గమనిక: ఇంట్లో నూనె తయారు చేసేటప్పుడు పరిశుభ్రత, సరైన నిల్వ పద్ధతులను పాటించడం ముఖ్యం. నూనెలో ఏదైనా తేడా వాసన, రుచి మారడం లేదా బూజు పట్టినట్లు అనిపిస్తే దానిని ఉపయోగించవద్దు.