NTV Telugu Site icon

Horse Gram Cultivation: ఉలవ సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు..

Ulavalu

Ulavalu

ఉలవలలో ఎన్నో పోషకాలు ఉంటాయి.. ఉలవ చారు, పప్పు, సలాడ్ లు చేసుకొని తింటారు.. వీటికి మార్కెట్ ఏడాది పొడవునా డిమాండ్ ఉంటుంది.. అందుకే రైతులు కూడా ఉలవ పంటను సాగు చెయ్యడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు.. మన రాష్ట్రంలో ఖరీఫ్ మొదటి పంట తరువాత వర్షాధారంగా లేదా ఏ పనులు వేయడానికి అనువుగా లేనప్పుడు ప్రత్యామ్నాయ పంటగా సాగు చేయవచ్చు.. ఉలవలు తొలకరి వేసిన వర్షాధార స్వల్పకాలిక పంటలైన పెసర , మినుము మరియు జొన్న, మొక్కజొన్న తదితర పంటల తర్వాత , లేటు ఖరిఫ్ లో ఉలవలు విత్తుకోవచ్చును.. ఈ పంటలో అంతర పంటలను కూడా వేసుకోవచ్చు..

ఇక భూమిని బాగా కలియ దున్నాలి..కల్టివేటరుతో ఒకసారి గొర్రు తోలి దుక్కి మెత్తగా తయారుచేసి విత్తుకోవాలి. నాగలి లేదా గోర్రుతో సాళ్ళ పద్ధతిలో సాళ్ళ మధ్య 30 సెం.మీ. ఎడంలో గింజలు సమంగా పడేటట్లు తగు పదనులో విత్తుకోవాలి. ప్రతి కిలో విత్తనానికి 1 గ్రా. కార్బండాజిమ్ లేదా థైరమ్ తో విత్తనశుద్ది చేసి విత్తుకోవాలి.. ఆ తర్వాత చివరి దుక్కిలో ఎకరాకు 2 టన్నుల పశువుల ఎరువు వేసుకోవాలి. ముందు పంట మోళ్ళను రోటావేటర్ తో భూమిలో కలియ దున్నాలి. రైజోబియం కల్చర్ ను విత్తనానికి పట్టించి ఉపయోగించవలెను. 100 మి.లీ. నీటిలో 10 గ్రా. పంచదార లేదా బెల్లం లేదా గంజి పౌడెర్ ను కలిపి 10 నిమిషాలు మరగబెట్టి చల్లర్చాలి. అలా చల్లార్చిన ద్రావణం 8 కిలోల విత్తనాల పై చల్లి దానికి 200 గ్రా. రైజోబియం కల్చర్ పొడిని కలిపి బాగా కలియ బెట్టి విత్తనం చుట్టూ పొరలా ఏర్పడేటట్లు జాగ్రత్త వహించాలి.. ఇలా చేసిన విత్తనాన్ని నీడలో ఆరబెట్టి విత్తుకోవాలి..

విత్తినాలు విత్తిన తొలి 30నుంచి 40 రోజుల వరకు కలుపు లేకుండా చూడాలి.. ఇక పంట కోత విషయానికొస్తే.. పూత, పిందే సమయంలో కాయ తొలుచు పురుగు ఎక్కువగా ఆశించి నష్టపరుస్తుంది. వీటి నష్టపరిచే లక్షణాలు, అనుకూల వాతావరణ పరిస్థితులు, నివారణ చర్యలు పెసర, మినుములో సూచించిన విధంగా పాటించవలెను. పంట పరిపక్వత దశలో కాయలు ఆకుపచ్చ నుండి పసుపు రంగుకు మారి ఎండిపోవును.. ఇలా 80% ఎండిపోయిన తర్వాత మాత్రం పంటను కొయ్యాలి.. అప్పుడే నాణ్యమైన పంట చేతికి వస్తుంది.. ఇకపోతే కోసిన పంటను 3-4 రోజుల వరకు పంట చేనులో గాని లేదా కళ్లం పై ఎండనిచ్చి ఆ తర్వాత కర్రలతో కొట్టిగాని, పశువులతో తొక్కించి లేదా ట్రాక్టర్ తో తోక్కించి లేదా ఆల్ క్రాప్ త్రేషర్ ను ఉపయోగించి నూర్పిడి చేయాలి. నూర్పిడి చేసిన గింజలను బాగా శుభ్రపరచి 2-3 రోజులు ఎండనిచ్చి తేమ శాతాన్ని చూసి గోనె సంచులలో నిల్వ చెయ్యాలి.. వెంటనే మార్కెట్ చేస్తే మంచిది..