Honor Smart Phone: 200MP కెమెరా, 11,000mAh బ్యాటరీ.. మార్కెట్లోకి కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్..

Honor

Honor

హానర్ సంస్థ తన కొత్త మ్యాజిక్ 9 సిరీస్‌లో భాగంగా ‘హానర్ మ్యాజిక్ 9 సూపర్ ఎడిషన్’ స్మార్ట్‌ఫోన్‌ను చైనా మార్కెట్లో అధికారికంగా విడుదల చేసింది. ప్రీమియం ఫీచర్లు, అత్యంత శక్తివంతమైన హార్డ్‌వేర్‌తో ఈ ఫోన్ మార్కెట్లోకి వచ్చింది. ఈ స్మార్ట్‌ఫోన్ ప్రధాన ఆకర్షణ దీని భారీ బ్యాటరీ సామర్థ్యం. ఇది మార్కెట్లో లభించే సాధారణ ఫోన్ల కంటే పూర్తిగా భిన్నంగా నిలుస్తుంది. వినియోగదారులకు పవర్‌ఫుల్ బ్యాకప్ అందించే ఉద్దేశంతో కంపెనీ ఇందులో ఏకంగా 11000mAh సామర్థ్యం గల పెద్ద బ్యాటరీని అమర్చింది.

క్వింగ్హై లేక్ బ్యాటరీ టెక్నాలజీని ఉపయోగించడం ద్వారా దీనిని తయారు చేశారనీ, దీని ఎనర్జీ డెన్సిటీ 963Wh/L వరకు ఉంటుందని నివేదికలు తెలుపుతున్నాయి. ఈ భారీ బ్యాటరీ కోసం 80W వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్, 50W వైర్‌లెస్ చార్జింగ్ సపోర్ట్‌ను కూడా అందించారు. దీనివల్ల ఈ ఫోన్ పవర్ బ్యాంక్‌కు దీటుగా పనిచేస్తుందని, పదే పదే చార్జ్ చేయాల్సిన అవసరం ఉండదని కంపెనీ పేర్కొంటోంది.

పనితీరు పరంగా చూస్తే.. ఈ ఫోన్‌లో క్వాల్కమ్ సరికొత్త స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 ప్రాసెసర్‌ను పొందుపరిచారు. గేమింగ్ లేదా ఇతర హెవీ అప్లికేషన్లను గంటల తరబడి ఉపయోగించినప్పటికీ ఫోన్ వేడెక్కకుండా ఉండేందుకు ఇందులో ప్రత్యేకంగా యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌ను కూడా చేర్చారు. దీనివల్ల డివైస్ ఉష్ణోగ్రత నియంత్రణలో ఉండి స్థిరమైన పనితీరును అందిస్తుంది.

డిస్ప్లే విషయానికి వస్తే.. ఇందులో 6.81 అంగుళాల ఫ్లాట్ డిస్‌ప్లేను ఇచ్చారు. ఇది 1.5కే రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ చేస్తుంది. స్క్రీన్ స్మూత్‌గా ఉండటంతో పాటు ఫ్లాట్ ప్యానెల్ ఇష్టపడే యూజర్లకు ఇది చక్కటి అనుభూతిని ఇస్తుంది. కెమెరా విభాగంలో కూడా ఈ ఫోన్ చాలా బలంగా ఉంది. దీని వెనుక భాగంలో ట్రిపుల్ కెమెరా సెటప్ ఇవ్వబడింది.

ఇందులో 200 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాతో పాటు, 12 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరా, 3x ఆప్టికల్ జూమ్ సపోర్ట్ కలిగిన 50 మెగాపిక్సెల్ టెలీఫోటో కెమెరా అమర్చబడి ఉన్నాయి. ఇక సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 50 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను అందించారు. ప్రస్తుతం ఈ స్మార్ట్‌ఫోన్‌ను కేవలం చైనా మార్కెట్లో మాత్రమే విడుదల చేశారు. భారత్‌లో దీని లాంచ్ తేదీ, ధరకు సంబంధించి హానర్ సంస్థ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఒకవేళ ఈ ఫీచర్లు భారత్‌కు వస్తే ప్రీమియం సెగ్మెంట్‌లో ఇది సంచలనం సృష్టించడం ఖాయం.