Site icon NTV Telugu

Honor Killing : మరో పరువుహత్య.. ఎస్సైలుగా పనిచేస్తున్న తల్లిదండ్రులే కొడుకుతో హత్య..!

Honor Killing

Honor Killing

చిన్ననాటి స్నేహం ప్రేమగా మారి చివరికి పరువు హత్యకు దారి తీసిన ఘటన తమిళనాడులో సంచలనం సృష్టించింది. తూత్తుకుడి జిల్లా ఏరల్‌ సమీపంలోని ఆరుముగమంగళం ప్రాంతానికి చెందిన చంద్రశేఖర్‌, సెల్వి దంపతుల కుమారుడు కవిన్‌కుమార్‌ చెన్నై ఐటీ కంపెనీలో ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. ఇటీవల సెలవులకు స్వస్థలానికి వెళ్ళిన కవిన్‌కుమార్‌ తన తాతకు అస్వస్థతగా ఉండటంతో ఆదివారం ఉదయం పాళయంకోట కేటీసీ నగర్‌ ప్రాంతంలో ఉన్న సిద్ధ వైద్య ఆస్పత్రికి తీసుకెళ్లాడు. ఆస్పత్రిలో తాతకు చికిత్స జరుగుతుండటంతో కవిన్‌కుమార్‌ బయట నిలబడ్డాడు. ఆ సమయంలో బైకుపై వచ్చిన ఓ యువకుడు అతడిని పిలిచాడు. కొంత దూరం వెళ్లాక బైకు నిలిపి కవిన్‌కుమార్‌తో ఆ యువకుడు గొడవకు దిగి హఠాత్తుగా కత్తితో దాడి చేసి పారిపోయాడు. కత్తిపోట్లతో కవిన్‌ కుమార్‌ అక్కడికక్కడే మృతి చెందాడు.

సమాచారం అందుకున్న పాళయంకోట పోలీసులు హుటాహుటిన వెళ్ళి కవిన్‌కుమార్‌ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టంకు తరలించారు. ఆ తర్వాత ఆ ప్రాంతంలోని సీసీ ఫుటేజీ ఆధారంగా కవిన్‌కుమార్‌ను హతమార్చింది పాళయం కోట కేటీసీ నగర్‌ ప్రాంతానికి చెందిన సుర్జిత్‌‌గా గుర్తించారు. సుర్జిత్‌ తండ్రి శరవణన్‌, తల్లి కృష్ణకుమారి ఎస్సైలుగా పనిచేస్తున్నారని తెలిసి, ప్రత్యేక దర్యాప్తు బృందం పోలీసులు సుర్జిత్‌ సహా, అతడి తల్లిదండ్రులను అరెస్టు చేశారు. అతడిని రహస్య ప్రదేశానికి తీసుకెళ్లి విచారించగా కవిన్‌కుమార్‌ది పరువుహత్యగా తేలింది.

కవిన్‌ చెన్నైలో టీసీఎస్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. సుర్జిత్ సోదరి ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో కన్సల్టెంట్ డాక్టర్‌గా పనిచేస్తోంది. అయితే ఉన్నత వర్గానికి చెందిన సుర్జిత్‌ సోదరి, కవిన్‌ గణేష్ కుమార్‌ బాల్య స్నేహితులు. ఇద్దరూ ఒకే స్కూలులో చదివారు. చిన్ననాటి స్నేహితులు కావడంతో ఈ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. సుర్జిత్‌ సోదరి సిద్ధ వైద్య ఆస్పత్రిలో పనిచేస్తుండటంతో ఆమెను చూడటానికి తరచూ వచ్చేవాడని, ఇద్దరు మాట్లాడుకోవడం చూసి సహించలేక పోయి ఎస్సైలైన యువతి తల్లిదండ్రులు కవిన్‌కుమార్‌ హత్య స్కేచ్ వేశారు. సోదరి ప్రేమను అన్న సుర్జిత్‌కు తెలియజేసి కవిన్‌ను చంపాలని ఉసిగొల్పారు. ఇక తన సోదరితో స్నేహం చేయడాన్ని సహించలేక సుర్జిత్‌ పథకం ప్రకారం హతమార్చినట్టు వాంగ్మూలం ఇచ్చాడని తెలిపారు.

పోలీసులు సుర్జిత్‌పై హత్య, అంటరానితనం నిరోధక చట్టం సహా నాలుగు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. నిందితుడు సుర్జిత్ తల్లిదండ్రులు ఇద్దరూ పోలీస్ శాఖలో పనిచేస్తున్నారు. తమ కుమారుడి నేరానికి కుట్రపన్నారు. హత్య వెనుక అమ్మాయి సోదరుడితో పాటు, ఆమె తల్లిదండ్రుల హస్తం ఉందని బాధిత కుటుంబం ఆందోళనకు దిగింది. ఈ నేపథ్యంలో ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి నిందితుడి తల్లిదండ్రులను వీఆర్‌లో ఉంచారు.

Exit mobile version