NTV Telugu Site icon

Telangana Elections 2023: రాష్ట్రంలో తొలిసారి తీసుకొచ్చిన హోమ్‌ ఓటింగ్ విధానం సక్సెస్

Home Voting

Home Voting

Telangana Elections 2023: తెలంగాణలో ఎన్నికల సంఘం తొలిసారిగా అమలు చేసిన హోమ్‌ ఓటింగ్‌ విధానం విజయవంతమైంది. పోలింగ్‌ కేంద్రానికి వెళ్లలేని వృద్ధులు, దివ్యాంగులకు ఈ విధానం చాలా బాగా ఉపయోగపడింది. గతంలో నడవలేని స్థితిలో ఉన్న వృద్ధులు, దివ్యాంగులు తమ ఓటుహక్కును వినియోగించుకోలేకపోయేవారు. ఈ హోమ్‌ ఓటింగ్‌ ద్వారా వారంతా తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. రాష్ట్రంలో తొలిసారిగా హోమ్‌ ఓటింగ్‌ను తెచ్చామని.. ఈ విధానం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 27 వేల 178 మంది అర్హత కలిగిన వారు తమ ఓటుహక్కును వినియోగించుకున్నారని తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారి వికాస్‌రాజ్‌ వెల్లడించారు. 80ఏళ్లు పైబడిన వృద్ధులు, 40శాతం కంటే ఎక్కువ వైకల్యం ఉన్న దివ్యాంగులు హోమ్‌ ఓటింగ్‌ విధానం ద్వారా నుంచి ఇంటి వద్దే ఓటు వేసేందుకు ఎన్నికల సంఘం అవకాశం కల్పించింది. ఈ నెల 23, 24, 25 తేదీల్లో ఈ ప్రక్రియను చేపట్టారు. ఎన్నికల సిబ్బంది, బీఎల్వో, పోలీసులతో కూడిన బృందం వారి ఇళ్లకు వెళ్లి బ్యాలెట్‌ రూపంలో రహస్యంగా ఓటు వేయించారు.

Read Also: CEO Vikas Raj: సైలెంట్‌ పీరియడ్ మొదలైంది.. ఈ 48 గంటలు చాలా కీలకం..

ఇదిలా ఉండగా.. తెలంగాణలో ఎన్నికల ప్రచారానికి తెరపడింది. రాష్ట్రంలోని 106 నియోజకవర్గాల్లో సాయంత్రం 5 గంటలకు ప్రచారం ముగిసింది. దీంతో రాష్ట్రంలో 144 సెక్షన్ అమల్లోకి వచ్చింది. ఈ సందర్భంగా సీఈఓ వికాస్ రాజ్ మీడియాతో మాట్లాడుతూ.. రాజకీయ నాయకులు ఎన్నికలకు సంబంధించిన ఎలాంటి ప్రచారం చేయొద్దని సూచించారు. అంతేకాకుండా.. ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియాలో కూడా ప్రచారం చేయొద్దని తెలిపారు. పోలింగ్ ముగిసిన అరగంట తర్వాతే ఒపీనియన్ పోల్ ప్రసారం చేయాలని చెప్పారు. ఈవీయం ర్యాండమైజేషన్‌ పూర్తి చేస్తామని సీఈఓ వికాస్ రాజ్ అన్నారు. ఈ 48 గంటలు చాలా కీలకమని.. పారదర్శకంగా ఎన్నికలు నిర్వహిస్తామని తెలిపారు. పోలింగ్ సందర్భంగా అభ్యర్థికి ఒక వాహనానికే అనుమతినిచ్చారు. ఇదిలా ఉంటే.. రేపు ఈవీఎం, ఎన్నికల సామగ్రి పంపిణీ ఉంటుందని వికాస్ రాజ్ తెలిపారు. ఈవీఎంల పంపిణీ, రవాణాకు సంబంధించి ఏదైనా సందేహాలు ఉంటే అభ్యర్థులు డిస్ట్రిబ్యూషన్ సెంటర్ కు వెళ్లొచ్చని పేర్కొన్నారు. ఈనెల 30వ తేదీ తెల్లవారుజామున 5.30కి మాక్ పోలింగ్ ఉంటుంది సీఈఓ వికాస్ రాజ్ చెప్పారు. హోమ్ ఓటింగ్ 27178 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారని.. అందులో సీనియర్ సిటీజన్లు 15999 మంది ఉన్నారని తెలిపారు. ఈరోజు కూడా ప్రభుత్వ ఉద్యోగులు, ఎన్నికల సిబ్బంది పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకుంటున్నారని చెప్పారు. 7571 పోలింగ్ స్టేషన్లలో ఎక్కువ మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారని.. డిస్ట్రిబ్యూషన్ సెంటర్లలో అన్ని ఏర్పాట్లు చేశామని సీఈఓ వికాస్ రాజ్ తెలిపారు.