Hussain Sagar: హైదరాబాద్.. నవాబులు పాలించిన ప్రాంతం. భారతదేశానికి స్వాతంత్రం రాకముందు ఎంతోమంది రాజులు ఆయా ప్రాంతాలను పాలిస్తూ వచ్చారు. హైదరాబాద్ అప్పట్లో భాగ్యనగరంగా నవాబులు పరిపాలించారన్న విషయం అందరికీ తెలిసిందే. ఇప్పటికీ ఆ కాలంలో నవాబులు కట్టించిన ఆయా కట్టడాలు హైదరాబాద్ తో పాటు తెలంగాణ రాష్ట్రంలో అక్కడక్కడ వారి గుర్తుగా కనిపిస్తూనే ఉంటాయి. అయితే, ప్రస్తుతం హైదరాబాద్ నగరం పేరు చెప్పగానే చాలామందికి గుర్తు వచ్చే వాటిలో చార్మినార్, గోల్కొండ, హుస్సేన్ సాగర్, హైదరాబాద్ బిర్యాని గుర్తుకు వస్తాయి. హైదరాబాద్ బిర్యానీ ప్రపంచవ్యాప్తంగా ఎంత ఫేమస్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హైదరాబాద్ లో ప్రముఖంగా చెప్పే ప్రదేశాలలో హుస్సేన్ సాగర్ కూడా ముందు ఉంటుంది. అయితే ఆ ప్రాంతానికి ఆ పేరు ఎలా వచ్చిందో మీకు తెలుసా..? తెలియకపోతే ఏం పర్లేదు.. ఇప్పుడు దాని వివరాలు ఒకసారి చూద్దాం..
హైదరాబాద్ ను పాలించిన నవాబులలో నవాబ్ ఇబ్రాహీం కులీఖుతుబ్షా కూడా ఒకరు. ఆయన అల్లుడి పేరు హుస్సేన్ షా. ఇతను పర్షియా (ఇరాన్) నుండి హైదరాబాద్ కు వలస వచ్చాడు. ఆ కాలంలో అతను ఓ ఇంజనీరు. నవాబు తన కూతురు ఖైరాతీబేగంను హుసేన్షాకు ఇచ్చి వివాహం చేశారు. అయితే ఆమె ఆరోగ్యం బాగులేక హకీంల సలహాపై గాలిమార్పుకోసం హైదరాబాద్, లష్కర్ (సికింద్రాబాద్ పాత పేరు) మధ్యలో ఒక చెరువు గట్టున కొన్ని రోజుల విశ్రాంతి కోసం బస చేశారు. ఇంజనీరు అయినా హుస్సేన్ షాకు ఆ చెరువు చూడగానే ఒక ఆలోచన తళుక్కున మెరిసింది. అదే విషయాన్ని నవాబుకి చెప్పాడు. దానితో ఆయన అల్లుడి సలహాను సరే అన్నాడు.
దానితో అతడు వందలాదిమంది వొడ్డెర కూలీలతో ఆ చెరువును లోతుగా తవ్వి బాగా వెడల్పు చేసి గగన్ పహాడ్ నుండి రాళ్లను తెప్పించి ఇటు హైదరాబాద్ కు అటు లష్కర్ కు మధ్య ఆనకట్టను కట్టారు. దాని నిర్మాణం 1563లో పూర్తి అయ్యింది. అపుడు హుస్సేన్ షా వలీ దానిపేరు ‘ఇబ్రాహీం సాగర్’ అని పెడదామనుకున్నాడు. కానీ, అప్పటికే కూలీలు, ప్రజలు ఆ ప్రాంతాన్ని హుస్సేన్ నిలబడి కట్టించాడు కాబట్టి ‘హుస్సేన్ సాగర్’గా పిలవటం ప్రారంభించేసరికి ఆ పేరే ఖాయం అయ్యింది. అయితే ఆ తర్వాత నవాబు కూడా తన పేరు లేనందుకు నారాజ్ అయ్యాడని గ్రహించిన అల్లుడు ఇక్కడ ఈ చెరువును తవ్వించాడు. దీని పేరు ఇబ్రాహీం సాగర్ అయ్యింది.
ఆ తర్వాత ఈ కట్ట కింద వెలిసిన ఊరే ఇబ్రాహీంపట్నం అయ్యింది. ఈ రెండు చెరువుల నిర్మాణం పని పూర్తి అయిన తర్వాత హుస్సేన్ షా సూఫీ సాధువుగా మారిపోయాడు. అన్ని సంబంధాలను తెంచుకుని “వలీ”గా మారాడు. ఆయన సమాధి హైదరాబాద్ షేక్ పేట్ లో ఉంది. దానిపేరు హుస్సేన్షా వలీ దర్గా.
