Birthday Cake: గత నెల పుట్టినరోజు కోసం ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసిన బర్త్‌డే కేక్ తిని పంజాబ్‌లో పదేళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. చిన్నారి తిన్న కేక్‌లో సింథటిక్ స్వీటెనర్ అధిక స్థాయిలో ఉన్నట్టు ఆరోగ్య శాఖ అధికారి సోమవారం వెల్లడించారు. బేకరీ నుంచి నాలుగు కేక్ నమూనాలను తీసుకోగా వాటిలో రెండు శాంపిల్స్‌లో కృత్రిమ స్వీటెనర్ అయిన సాచరిన్ ఎక్కువగా ఉన్నట్లు గుర్తించామని జిల్లా ఆరోగ్య అధికారి డాక్టర్ విజయ్ జిందాల్ తెలిపారు. సాచరిన్ సాధారణంగా చక్కెర ప్రత్యామ్నాయంగా ఉపయోగించబడుతున్నప్పటికీ, అధిక పరిమాణంలో పదార్ధం కడుపు నొప్పికి కారణమవుతుంది.
Read Also: Cyber Crime: మాఫియా డాన్ కుమారుడికే టోకరా.. సైబర్ కేటుగాళ్ల ఘరానా మోసం
మాన్వి, ఆమె సోదరి తిన్న కేక్‌పై ఫోరెన్సిక్ నివేదిక ఇంకా రాలేదని, అయితే కేక్‌ను తయారు చేసిన బేకరీలోని ఇతర నమూనాలలో కృత్రిమ స్వీటెనర్‌లు అధిక స్థాయిలో ఉన్నాయని డాక్టర్ విజయ్ జిందాల్ స్పష్టం చేశారు. మాన్వి మృతితో బేకరీపై దాడులు నిర్వహించి నమూనాలను సేకరించారు.డాక్టర్ జిందాల్ మాట్లాడుతూ, కేక్ నమూనాల నిర్ధారణలను కోర్టుకు తెలియజేస్తామని, బేకరీపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. మాన్వి మృతి తర్వాత ఆమె కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.
Read Also: Salman Khan Firing: కాల్పుల కేసులో తుపాకీ దొరికింది.. రంగంలోకి ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్!
మార్చి 24న పటియాలాకు చెందిన 10 ఏళ్ల చిన్నారి మాన్వికి కుటుంబసభ్యులు పుట్టిన రోజు వేడుకలు నిర్వహించి, ఆన్‌లైన్‌లో కేక్ ఆర్డర్ చేశారు. ఆ కేక్ తిన్న తర్వాత అందరూ అనారోగ్యం బారిపడ్డారు. అస్వస్థతకు గురైన మాన్విని ఆస్పత్రికి తరలించగా.. ఆమెను కాపాడేందుకు వైద్యులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. బాధిత కుటుంబం ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. ఆర్డర్ చేసిన కేక్ నమూనాలను పరీక్షలకు పంపగా.. అందులో ప్రమాదకర పదార్థం సింథటిక్ స్వీటెనర్ ఉన్నట్టు తేలింది.