Rahul Gandhi: పరువు నష్టం కేసులో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీకి మరోసారి ఊరట లభించింది. న్యాయస్థానం హాజరు నుంచి మినహాయింపును ఇస్తూ గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను ముంబయి హైకోర్టు పొడిగించింది. ఆగస్ట్ 2 వరకు ప్రత్యక్ష హాజరు నుండి మినహాయింపును ఇచ్చింది. 2019 సార్వత్రిక ఎన్నికల సమయంలో మోదీ ఇంటిపేరుపై రాహుల్ చేసిన వ్యాఖ్యలకు గాను బీజేపీకి చెందిన మహేశ్ శ్రీశ్రీమల్ 2021లో పరువు నష్టం కేసు వేశారు. దీనిపై విచారణకు రాహుల్ గాంధీ ప్రత్యక్షంగా హాజరు కావాలంటూ గతంలో స్థానిక కోర్టు సమన్లు జారీ చేసింది. దీనిని సవాల్ చేస్తూ రాహుల్ బాంబే హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై ఇటీవల విచారణ చేపట్టిన జస్టిస్ ఎస్వీ కొత్వాల్ నేతృత్వంలోని సింగిల్ బెంచ్ ధర్మాసనం తీర్పును వాయిదా వేసింది. తాజాగా హాజరు మినహాయింపును కోర్టు మరోసారి పొడిగించింది.
Also Read: Cyclone Biparjoy: ప్రధాని మోడీ హైలెవల్ మీటింగ్.. బిపర్జోయ్ తుఫాన్ను ఎదుర్కొనే దానిపై సమీక్ష
గుజరాత్ బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేశ్ మోడీ పరువునష్టం దావా వేయడంతో సూరత్ కోర్టు రాహుల్ గాంధీని దోషిగా తేల్చిన విషయం తెలిసిందే. ఆయనకు రెండేళ్ల జైలు శిక్ష విధించిన కోర్టు.. వెంటనే బెయిల్ కూడా మంజూరు చేసింది. ఈ తీర్పును పై కోర్టులో అప్పీలు చేసుకునేందుకు అవకాశం ఇచ్చింది. రెండేళ్ల జైలు శిక్ష విధించిన నేపథ్యంలో రాహుల్ గాంధీ ఎంపీ సభ్యత్వాన్ని లోక్‌సభ సెక్రెటేరియేట్ రద్దు చేసింది. దీనిని సవాల్ చేస్తూ రాహుల్‌గాంధీ గుజరాత్ హైకోర్టును ఆశ్రయించారు. తనకు విధించిన శిక్షను నిలిపేయాలంటూ వేసిన స్టే పిటిషన్‌ను సూరత్ సెషన్స్ కోర్టు తిరస్కరించిన నేపథ్యంలో.. న్యాయస్థానం తీర్పును సవాల్ చేస్తూ ఆయన తాజాగా గుజరాత్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై హైకోర్టు విచారణ చేపట్టాల్సి ఉంది.