Hezbollah Commander Hassan: పశ్చిమాసియా యుద్ధ క్షేత్రంలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. దక్షిణ లెబనాన్‌లో ఇజ్రాయెల్ సైన్యంతో హోరాహోరీగా పోరాడుతున్న హిజ్బుల్లా సంస్థకు చెందిన కీలక కమాండర్ హసన్ తొలిసారిగా అంతర్జాతీయ టెలివిజన్ ముందుకు వచ్చి సంచలన ప్రకటనలు చేశారు. గత 15 నెలలుగా తమ యోధులు ఈ యుద్ధం కోసమే ఎదురుచూస్తున్నారని, తమ భూభాగాన్ని కాపాడుకోవడానికి ప్రాణ త్యాగానికైనా సిద్ధమని ఆయన ప్రకటించారు.
READ ALSO: కొత్త ఫీచర్లు, మెరుగైన 25కి పైగా అప్డేట్స్‌తో Hyundai Exter Facelift లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే..!
4,000 దాడులు.. 500 మంది మరణం
కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇజ్రాయెల్ తుంగలో తొక్కిందని హసన్ ఆరోపించారు. “కాల్పుల విరమణ సమయంలో కూడా ఇజ్రాయెల్ సుమారు 4,000 దాడులు చేసింది. ఇళ్లు, రోడ్లు, మౌలిక సదుపాయాలను ధ్వంసం చేయడమే కాకుండా 500 మంది పౌరులను పొట్టనబెట్టుకుంది. అందుకే మా పోరాటం ఆగదు” అని ఆయన స్పష్టం చేశారు. దక్షిణ లెబనాన్ ప్రజలను రక్షించడమే తమ ఏకైక లక్ష్యమని, అక్కడ ప్రతి ఒక్కరూ హిజ్బుల్లా వారేనని ఆయన వ్యాఖ్యానించారు. యుద్ధ క్షేత్రంలో సాధించిన విజయాలను హసన్ ఈ సందర్భంగా వివరించారు. కేవలం 25 రోజుల పోరాటంలో 119 ఇజ్రాయెల్ మెర్కావా ట్యాంకులను, సాయుధ వాహనాలను ధ్వంసం చేశామని వెల్లడించారు. అలాగే ఉత్తర ఇజ్రాయెల్‌లోని 20 కీలక సైనిక స్థావరాలపై దాడులు చేశామని చెప్పారు. వ్యూహాత్మక ప్రాంతమైన లిటాని నదిని చేరుకోకుండా ఇజ్రాయెల్ బలగాలను విజయవంతంగా అడ్డుకుంటున్నామని హసన్ పేర్కొన్నారు.
ఇరాన్ మద్దతుపై ఆసక్తికర వ్యాఖ్యలు..
ఇరాన్ నుంచి అందుతున్న ఆయుధ సరఫరా గురించి మాట్లాడుతూ.. “ఆయుధాల గురించి యుద్ధభూమియే సమాధానం ఇస్తుంది” అంటూ హసన్ నేరుగా సమాధానం చెప్పకుండా దాటవేశారు. అయితే, 1982లో తమ సంస్థ ఏర్పడినప్పటి నుంచి లెబనీస్ ప్రజలను కాపాడటానికి ఇరాన్ మద్దతు ఇస్తోందని, కానీ తమ అసలైన బలం స్థానిక ప్రజల మద్దతులోనే ఉందని ఆయన స్పష్టం చేశారు. ఈ యుద్ధం ఎప్పుడు ముగుస్తుందనే దాని గురించి మాట్లాడుతూ.. “ఈ యుద్ధానికి కాలపరిమితి లేదు. మా యోధులు పోరాడకపోతే ఇజ్రాయెల్ మమ్మల్ని నిర్మూలిస్తుంది. అందుకే మా చివరి శ్వాస వరకు పోరాటం సాగుతుంది” అని తేల్చి చెప్పారు.
READ ALSO: Varun Tej Bari: బాబాయ్ బ్లెస్సింగ్స్‌తో ‘బరి’లోకి దిగిన వరుణ్ తేజ్!
