Hero Bikes Offers: భారతదేశంలో పర్యావరణహిత రవాణా పరిష్కారాలను ప్రోత్సహించే దిశగా అడుగులు వేస్తున్న హీరో మోటో కార్ప్ (Hero MotoCorp) తాజాగా విడుదల చేసిన ఫ్లెక్స్-ఫ్యూయెల్ మోటార్‌సైకిళ్లపై భారీ ఆఫర్‌ను ప్రకటించింది. కొత్తగా మార్కెట్లోకి వచ్చిన హీరో స్ప్లెండర్ ప్లస్ ఫ్లెక్స్ ఫ్యూయెల్, హీరో హెచ్‌ఎఫ్ డీలక్స్ ఫ్లెక్స్ ఫ్యూయెల్ బైక్‌లపై రూ.4,000 వరకు తగ్గింపును అందిస్తోంది. ఈ ఆఫర్ జూలై 2026 వరకు అందుబాటులో ఉండనుంది.
ఈ డిస్కౌంట్‌తో హీరో స్ప్లెండర్ ప్లస్ ఫ్లెక్స్ ఫ్యూయెల్ బైక్ ఎక్స్-షోరూమ్ ధర రూ.82,710 నుంచి రూ.78,710కు తగ్గింది. అదే విధంగా హీరో హెచ్‌ఎఫ్ డీలక్స్ ఫ్లెక్స్ ఫ్యూయెల్ ధర రూ.72,792 నుంచి రూ.68,792కు చేరింది. దీంతో ఫ్లెక్స్-ఫ్యూయెల్ టెక్నాలజీని అనుభవించాలనుకునే వినియోగదారులకు ఇవి మరింతగా ఉపయోగపడనున్నాయి. ప్రస్తుతం విక్రయాల్లో ఉన్న సాధారణ E20 ఇంధనానికి అనుకూలమైన స్ప్లెండర్ ప్లస్‌తో పోలిస్తే ఫ్లెక్స్ ఫ్యూయెల్ వెర్షన్ ధర కేవలం రూ.1,153 మాత్రమే ఎక్కువగా ఉంది. మరోవైపు హెచ్‌ఎఫ్ డీలక్స్ ఫ్లెక్స్ ఫ్యూయెల్ బైక్, HF Deluxe i3S Cast వేరియంట్ కంటే దాదాపు రూ.1,650 తక్కువ ధరలో లభించడం విశేషం.
బైక్‌ల ప్రత్యేకత ఏంటి?
హీరో స్ప్లెండర్ ప్లస్ ఫ్లెక్స్ ఫ్యూయెల్, హీరో హెచ్‌ఎఫ్ డీలక్స్ ఫ్లెక్స్ ఫ్యూయెల్ బైక్‌ల ప్రధాన ప్రత్యేకత E85 ఇంధనంపై నడవగల సామర్థ్యం. E85లో 85% ఎథనాల్, 15% పెట్రోల్ ఉంటుంది. అధిక ఎథనాల్ మిశ్రమ ఇంధనంపై నడిచే భారతదేశంలోని తొలి మాస్-మార్కెట్ కమ్యూటర్ బైక్‌లలో ఇవి ఒకటిగా నిలిచాయి. E85 ఇంధనానికి అనుకూలంగా మార్చేందుకు హీరో మోటోకార్ప్ పలు సాంకేతిక మార్పులు చేసింది. ఇందులో మెరుగైన ఫ్యూయెల్ పంప్, అదనపు ఫ్యూయెల్ ఫిల్టర్, అలాగే ఇంధనంలో ఉన్న ఎథనాల్ శాతాన్ని బట్టి సరైన ఇంధన సరఫరా జరిగేలా రీక్యాలిబ్రేట్ చేసిన ఇంజిన్ కంట్రోల్ యూనిట్ (ECU)ను అమర్చింది.
ఈ రెండు బైక్‌లలోనూ 97.2cc ఎయిర్-కూల్డ్ సింగిల్ సిలిండర్ ఇంజిన్‌ను అందించారు. E85 ఇంధనంపై ఈ ఇంజిన్ 8.4bhp పవర్, 8.3 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. సాధారణ పెట్రోల్ వెర్షన్లతో పోలిస్తే E85 ఇంధనం ఉపయోగించినప్పుడు పవర్‌లో 7%, టార్క్‌లో 3% పెరుగుదల ఉంటుందని హీరో మోటోకార్ప్ చెబుతోంది. అంటే ఈ బైక్‌లు పర్యావరణానికి మేలు చేయడమే కాకుండా కొంత మెరుగైన పనితీరును కూడా అందిస్తాయి. హీరో స్ప్లెండర్ ప్లస్ ఫ్లెక్స్ ఫ్యూయెల్, హీరో హెచ్‌ఎఫ్ డీలక్స్ ఫ్లెక్స్ ఫ్యూయెల్ బైక్‌ల విక్రయాలు జూలై 2026 నుంచి ఢిల్లీతో పాటు మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాల్లో ప్రారంభం కానున్నాయి. ఆ తర్వాత దశలవారీగా దేశంలోని ఇతర నగరాలు, రాష్ట్రాలకు కూడా వీటి అమ్మకాలను చేపడుతున్నట్లు కంపెనీ వెల్లడించింది.

