ప్రముఖ దర్శకులు, స్వర్గీయ బాపు దగ్గర పలు చిత్రాలకు సహ దర్శకునిగా పనిచేశారు కాకర్ల శ్రీనివాసు. తన గురువు మరణానంతరం ఆయన తొలిసారి మెగా ఫోన్ చేతిలోకి తీసుకున్నారు. విశేషం ఏమంటే… ఒకే ఒక్క పాత్రతో కాకర్ల శ్రీనివాసు ‘హలో మీరా!’ అనే సినిమాను రూపొందించారు. లూమియర్ సినిమా బ్యానర్‌పై జీవన్ కాకర్ల సమర్పణలో ఈ ప్రయోగాత్మక చిత్రాన్ని డాక్టర్ లక్ష్మణరావు దిక్కల, వర ప్రసాదరావు దుంపల, పద్మ కాకర్ల నిర్మించారు. మీరా అనే పాత్ర చుట్టూ తిరిగే ఈ మూవీ ప్రేక్షకులకు అనుక్షణం సీట్ ఎడ్జ్ థ్రిల్లింగ్ ఎక్స్ పీరియన్స్ ను ఇస్తుందని మేకర్స్ అంటున్నారు.
తాజాగా మూవీ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో ప్రధాన పాత్రధారిణి మీరాను చూపిస్తూ కథలోని యాంగిల్ ఏంటనేది స్పష్టం చేశారు. మీరా వెనకాల కనిపిస్తున్న ప్రకాశం బ్యారేజ్ ను చూస్తుంటే ఇది విజయవాడ నేపథ్యంలో తెరకెక్కిన సినిమా అనిపిస్తోంది. ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగే ప్రయాణమే ఈ సినిమా అని, ఖచ్చితంగా ఇది ప్రేక్షకులకు మునుపెన్నడూ లేని కొత్త అనుభూతినిస్తుందని దర్శకుడు కాకర్ల శ్రీనివాసు తెలిపారు. తెరపై కనిపించే మీరాతోపాటు ఫోన్ కాల్స్ లో వినిపించే పాత్రలు మరింత ఉత్కంఠ రేపుతాయని ఆయన చెప్పారు. తొలికాపీ సైతం సిద్ధమైన ఈ సినిమాలో మీరాగా గార్గేయి యల్లాప్రగడ నటించారు. సూరి సాధనాల అసోసియేట్ డైరెక్టర్ గా పని చేశారు.ఈ చిత్రానికి ఎస్ చిన్న సంగీతం అందించగా, హిరణ్మయి కల్యాణ్ మాటలు రాశారు. రాంబాబు మేడికొండ కూర్పరిగా వ్యవహరించిన ఈ సినిమాకు అనంత శ్రీధర్ లైన్ ప్రొడ్యూసర్.