Heavy Rains: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పనపీడనం ప్రభావంతో నెల్లూరు జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. తీర ప్రాంతంలో ప్రజలు సముద్రంలోకి వెళ్ళవద్దని హెచ్చరికలు జారీ అయ్యాయి. సముద్రంలోకి వేటకు వెళ్లిన మత్స్యకారులు వెంటనే తిరిగి రావాలని అధికారులు సూచించారు. కాలువలు, చెరువుల వద్ద అప్రమత్తంగా ఉండాలని జలవరుల శాఖ అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి. నెల్లూరు నగరంలోని లోతట్టు ప్రాంతాల్లోని కాలువలలో నీరు సజావుగా సాగేందుకు సిబ్బంది చెత్తను తొలగిస్తున్నారు. నేడు విద్యా సంస్థలకు కలెక్టర్ సెలవు ప్రకటించారు. ఆర్టీసీ బస్సుల రాకపోకలు యథాతథంగా నడుస్తున్నాయి. చెన్నై- విజయవాడ మార్గంలో వేగం తగ్గించి రైళ్లను రైల్వే శాఖ నడుపుతోంది. ఈరోజు తెల్లవారుజామున నుంచి ఇప్పటివరకూ 4 సెంటీమీటర్ల వర్ష పాతం నమోదైంది. వర్షం నిలిచిపోవడంతో కొంత ఉపశమనం కలిగింది.
Read Also: Heavy Rains in Andhra Pradesh: భారీ వర్షాలపై సీఎస్, స్పెషల్ సీఎస్ సమీక్ష.. ఇలా చేయండి..!
నెల్లూరు జిల్లాలో భారీ వర్షాల ప్రభావం, తీసుకున్న జాగ్రత్తలపై జిల్లా కలెక్టర్‌తో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి చర్చించారు. క్షేత్ర స్థాయిలో ప్రతీ అధికారి అందుబాటులో ఉండి జిల్లాలో తుఫాను నష్టాలు ధీటుగా ఎదుర్కొనేలా ప్రజలందరినీ అప్రమత్తం చేయాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉంటూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు. జిల్లాలో భారీ వర్షాల హెచ్చరిక నేపథ్యంలో అధికారులను అప్రమత్తం చేశారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ముందస్తు చర్యలు చేపట్టాలని రెవెన్యూ, పోలీసు అధికారులను మంత్రి ఆదేశించారు. ఎలాంటి విపత్కర పరిస్థితి అయినా ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం సంసిద్ధంగా ఉందన్నారు. కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షిస్తున్నామన్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షితంగా ఉంచేందుకు పునరావాస కేంద్రాల ఏర్పాటు చేయాలన్నారు. మంత్రి ఆనం సూచనలతో..ఆత్మకూరు రెవెన్యూ డివిజన్ పరిధిలోని లోతట్టు ప్రాంతాల్లో పర్యటిస్తూ ప్రజలను ఆర్డీవో పావని అప్రమత్తం చేస్తున్నారు.