Heavy Rains in AP Due to Cyclone Michaung: బంగాళాఖాతంలో ఏర్పడిన మిచాంగ్ తుపాన్ వాయుగుండంగా బలహీనపడింది. ఈ వాయుగుండం ఈరోజు మధ్యాహ్నానికి అల్పపీడనంగా బలహీనపడే అవకాశముంది. మిచాంగ్ ప్రభావంతో ఏపీలో ప్రస్తుతం వర్షాలు ఉరుస్తున్నాయి. మరో 24 గంటల పాటు కోస్తాంధ్ర, రాయలసీమతో పాటు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.
ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం దాములూరు వద్ద వైరా, కట్టలేరు వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. తెలంగాణ నుంచి భారీగా నీరు చేరడంతో.. పల్లంపల్లి-దాములూరు గ్రామాల మధ్య కాజ్‌వే మీదుగా వరద ప్రవహిస్తోంది. కట్లేరు, పడమటి, ఎదుళ్ల, విప్ల, గుర్రపు, కొండవాగులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. తెలంగాణ నుంచి వస్తున్న వరదతో కట్లేరు ప్రమాదకర స్థాయికి చేరింది. కాకినాడ జిల్లా తుని, కోటనందూరు మండలాల్లో భారీ వర్షం కురిసింది. దాంతో కోటనందూరు మండలం కాకరాపల్లి వద్ద బొండుగడ్డ వాగు పొంగి ప్రవహిస్తోంది.
Also Read: Cyclone Michaung: మిచాంగ్ తుఫాను ఎఫెక్ట్.. అన్నదాతల ఆందోళన!
అల్లూరు సీతారామరాజు జిల్లా ముంచంగిపుట్టు మండలం పరదానిపుట్టు వంతెనపై వరదనీరు భారీగా ప్రవహిస్తోంది. దీంతో 50 గ్రామాల ప్రజల రాకపోకలకు అడ్డంకిగా మారింది. భారీ వర్షాలు, ఈదురు గాలులకు బాపట్ల జిల్లా చినగంజాం, మార్టూరు, యద్దనపూడి మండలాల్లో మంగళవారం మధ్యాహ్నం నుంచి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. తుపాను దెబ్బకు నెల్లూరు డివిజన్ పరిధిలో 250 కిమీ, కావలి డివిజన్‌లో 170 కిమీ మేర ఆర్‌అండ్‌బీ రహదార్లు దెబ్బతిన్నాయి. చాలా చోట్ల పంట పొలాల్లోంచి వరదనీరు వెళ్తోంది. దీంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.