NTV Telugu Site icon

Andhra News: అనంతపురంలో వర్ష బీభత్సం.. ఇళ్లలోకి భారీగా వరద నీరు

Anantapur

Anantapur

Andhra News: అనంతపురం నగరంలో మంగళవారం రాత్రి భారీ వర్షం కురిసింది. దీంతో పలు కాలనీల్లోని వరద పోటెత్తింది. కాలనీల్లోకి పెద్ద ఎత్తున నీరు వచ్చి చేరడంతో ఇళ్లలోనికి నీరు ప్రవేశించి జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. రాత్రి రెండు గంటల సమయం నుంచి భారీ వర్షంతో ఎగువ నుంచి వరద విజృంభించింది. యాలేరు, ఆలమూరు చెరువుల నుంచి వరద అనంతపురం నగరాన్ని ముంచెత్తింది. ఇళ్లలోకి వరద ప్రవేశించటంతో అర్ధరాత్రి దాటాక ప్రజలు మిద్దెలపైకి వెళ్లి భయంగా గడిపారు. ఇప్పటికీ చాలా కాలనీల్లో మూడు అడుగుల మేర వరద ప్రవహిస్తూనే ఉంది.

ఇదివరకే కురిసిన వర్షాలకు నిండుగానున్న చెరువుల్లో నుంచి నీరు మత్తడి పారుతోంది. ప్రధానంగా అనంతపురం రూరల్‌ పరిధిలో గల రుద్రంపేట నుంచి అనంతపురం నగరంలోకి వచ్చే చోట నడిమివంక ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో రుద్రంపేట, అనంతపురం నగరానికి మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. 4వ రోడ్డులోని రజక్ నగర్, రంగస్వామినగర్, సీపీఐ కాలనీల్లోకి వరద నీరు చేరింది. దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

Read Also: Fire : కార్లలో మంటలు.. కలవరపడిన ప్రయాణికులు

వరద నీటిలో చిక్కుకున్న హాస్టల్ విద్యార్థులను రక్షించిన అనంతపురం పోలీసులు
వరద నీటితో చిక్కుకున్న 30 మంది హాస్టల్ విద్యార్థులను సురక్షితం చేసిన 4వ పట్టణ పోలీసులు. నిన్న రాత్రి కురిసిన వర్షం, పైతట్టు ప్రాంతాల నుండి వచ్చిన వరద నీటితో స్థానిక వికలాంగుల కొట్టాలలోని శ్రీ రామకృష్ణ ఇంగ్లీష్ మీడియం పాఠశాల విద్యార్థులు 30 మంది చిక్కుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న సి.ఐ జాకీర్ హుస్సేన్,సిబ్బందితో కలసి అక్కడికి వెళ్లి ఆ పాఠశాలకు చెందిన బస్సు ద్వారానే 30 మందిని సురక్షిత ప్రాంతానికి తరలించారు. దీంతో పాటు విశ్వశాంతి నగర్ లోని ఓ ఇంట్లో చిక్కుకున్న ఇద్దరు వృద్ధులను, ఆరు బర్రెలను సురక్షితం చేశారు.