Site icon NTV Telugu

Anantapur Rains: అనంతపురం జిల్లాను వణికిస్తున్న వరదలు

Rains Atp

Rains Atp

గతంలో ఎన్నడూ లేని విధంగా ఉమ్మడి అనంతపురం జిల్లా వరదలతో అతలాకుతలం అవుతోంది. శ్రీ సత్య సాయి జిల్లా ఎడతెరిపి లేని వర్షానికి ప్రభుత్వ ఆసుపత్రిలోని పోస్టుమార్టం భవనంలోకి బురద చేరింది. దీంతో భవనం ఆరుబయట పోస్ట్ మార్టం నిర్వహించారు వైద్యులు. వివిధ కారణాలతో మరణించిన వారికి పోస్టుమార్టం కోసం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మార్చురీ గదిలో భారీవర్షాలకు డెడ్ బాడీలు తడిసిముద్దయ్యాయి. ఉదయం పోస్టుమార్గం నిర్వహించాల్సి వుంది. మార్చురీ గదిలో కాలుపెట్టలేనంతగా బురద పేరుకుపోయింది. మృతిచెందిన వారి కుటుంబీకులను పరామర్శించేందుకు వచ్చిన టీడీపీ నేతలు సవిత అధికారుల తీరుపై మండిపడ్డారు.

Read Also: Chennai Crime: రన్నింగ్ ట్రైన్ హత్య కేసులో ప్రియుడు అరెస్టు

కర్ణాటక ఎగువ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలకు పెన్నా, జయమంగళి నదులు ప్రమాదకరంగా మారాయి. హిందూపురం పట్టణంలోని ఎంపీడీవో ఆఫీస్ సమీపంలో భారీగా మరవ పారుతుంది కొట్నూరు చెరువు నీరు. నీటి ప్రవాహానికి ఓ పక్క వాలిపోయింది లారీ. క్రేన్ సహాయంతో బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నారు పోలీసులు. నీటి ప్రవాహం ఎక్కువగా ఉండడంతో హిందూపురం నుంచి అనంతపురానికి రాకపోకలు నిలిపివేశారు. పట్టణంలోని సింగిరెడ్డి పల్లి వద్ద ఇచర్ వాహనం రోడ్డు పై నిలిచిపోవడంతో అనంతపురం వెళ్లేందుకు ప్రయాణికులకు ఇబ్బందులు పడుతున్నారు.

బారికేడ్లు వేసి రాకపోకలు పోలీసు నిలిపివేశారు. భారీ వర్షాల వల్ల చెరువులు పూర్తి స్థాయిలో మరోసారి నిండిపోయాయి. మొరవలు పారడంతో రోడ్లపై నీరు భారీగా ప్రవహిస్తుంది. దీంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కర్ణాటకలో కురిసిన భారీ వర్షాలకు పరిసర ప్రాంతాల్లో వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. అనంతపురం వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు నష్టపోయినవారికి ప్రభుత్వం ఆర్ధిక సహాయం ప్రకటించింది. బాధిత కుటుంబాలకు రూ.2వేల చొప్పున తక్షణ సహాయం అందిస్తారు. ప్రతి బాధిత కుటుంబానికి బియ్యం, పామాయిల్‌, కందిపప్పు, బంగాళాదుంపలు, ఉల్లిపాయలు ఈ ఐదు రకాల నిత్యావసర వస్తువులు అందిస్తారు. ఆర్ధిక సహాయ ఖర్చుల కోసం అనంతపురం జిల్లా కలెక్టర్‌కు 93 లక్షల మొత్తం విడుదల చేసింది ఆర్థికశాఖ. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం.

Read Also: Astrology: అక్టోబర్ 14, శుక్రవారం దినఫలాలు

Exit mobile version