NTV Telugu Site icon

Heavy Rain Forecast: భారీ వర్ష సూచన.. ఏపీలో 9 జిల్లాలకు, తెలంగాణలో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్‌

Rain Forecast

Rain Forecast

Heavy Rain Forecast: ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ అప్రమత్తం చేసింది భారత వాతావరణ శాఖ (ఐఎండీ).. తెలంగాణలోని 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ జారీ చేస్తే.. ఏపీలోని 9 జిల్లాల్లో ఎల్లో వార్నింగ్‌ జారీ చేసింది ఐఎండీ.. తెలంగాణ పరిసర ప్రాంతాల్లో ఆవర్తనం ఏర్పడింది.. దీని ప్రభావంతో రాష్ట్రంలో ఈ రోజు, రేపు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. రాష్ట్రంలోని తూర్పు , పశ్చిమ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని.. ఈ రోజు నిర్మల్, నిజామాబాద్, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలకు భారీ వర్ష సూచన ఉందని తెలిపింది.. నేడు 8 జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ..

మరోవైపు ఈ రోజు హైదరాబాద్‌లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని.. కానీ, ఈ నెల 28వ తేదీన హైదరాబాద్ కు భారీ వర్ష సూచన ఉందని తెలిపింది వాతావరణశాఖ.. 28న హైదరాబాద్ కి ఎల్లో అలెర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఇక, 28వ తేదీన హైదరాబాద్‌ సిటీలో వినాయక నిమజ్జనాలు ఉన్న నరేపథ్యంలో.. భారీ వర్ష సూచన ఉండటంతో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించింది ఐఎండీ.

ఇక, ఆంధ్రప్రదేశ్లోని తొమ్మిది జిల్లాలకు భారీ వర్ష సూచన ఉందంటూ ఎల్లో వార్నింగ్ ఇచ్చింది ఐఎండీ. పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, తూర్పు గోదావరి, ఎన్టీఆర్‌, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాలకు హెచ్చరికలు జారీ చేసింది.. తమిళనాడు, ఉత్తరాంధ్రను అనుకుని ఉపరితల అవర్తనాలు కొనసాగుతుండగా.. ఈ నెల 29న అండమాన్ సముద్రంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని సూచించింది.. అల్పపీడనం ఏర్పడిన తర్వాత బలపడే అవకాశం వుందని విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం అంచనా వేస్తోంది.. మొత్తంగా.. ఇటు తెలంగాణతో పాటు అటు ఆంధ్రప్రదేశ్‌కి కూడా భారీ వర్ష సూచన ఉందని చెబుతోంది వాతావరణశాఖ.