NTV Telugu Site icon

Weather Update: ఏపీకి మరోసారి భారీ వర్ష సూచన.. ఆ జిల్లాలకు రెడ్‌ అలర్ట్

Heavy Rains

Heavy Rains

Weather Update: ఆంధ్రప్రదేశ్‌లో మరో సారి భారీ వర్షాలు కురవనున్నాయి. రానున్న 24 గంటల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అల్లూరి సీతారామరాజు, తూర్పూగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాలకు రెడ్‌ అలర్ట్ జారీ చేసింది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, విశాఖ, అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారింది. వాయవ్య బంగాళాఖాతం దానికి ఆనుకుని ఉన్న మధ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. ఉత్తర దిశగా కదులుతూ రాగల 12 గంటల్లో ఉత్తర ఒడిశా, పశ్చిమబెంగాల్, బంగ్లాదేశ్ తీరాలకు సమీపంలో వాయుగుండంగా మారే అవకాశం ఉంది. దీని ప్రభావంతో ఉత్తర కోస్తాలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం హెచ్చరించింది. ఇప్పటికే పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. తీరం వెంబడి బలమైన ఈదురు గాలులు వీస్తున్న నేపథ్యంలో మత్స్యకారులు వేటకు వెళ్ళరాదని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం పేర్కొంది.

Read Also: Heavy Rain Forecast: తెలుగు రాష్ట్రాలకు భారీ నుంచి అతిభారీ వర్ష సూచన.. మరో 4 రోజులు వానలే వానలు..!

తెలంగాణలోనూ వచ్చే నాలుగు రోజులు విస్తారంగా వానలు పడతాయని వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదివారం తేలికపాటినుంచి మోస్తరు వర్షం చాలాచోట్ల కురిసే అవకాశం ఉందని తెలిపింది. కొమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పింది. ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు, గంటకు 40 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీస్తాయని తెలిపింది. సోమవారం కూడా పలు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే చాన్సుందని ఐఎండీ తెలిపింది. మంగళవారం తెలంగాణ వ్యాప్తంగా మోస్తరు నంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. బుధవారం వరకు వానలు తెరిపివ్వకపోవచ్చని హెచ్చరించింది.